
75 కోట్ల కోట్ల రూపాయలతో అమెరికా టాప్
ఇండియాకు ఏడో ర్యాంకు.. రూ.8.95 కోట్ల కోట్ల సంపద
759కి పెరిగిన ఇండియన్ మిలియనీర్లు
2010లో 34.. 2018లో 725 మంది
మీమైనా ఆస్తులున్నయా? వాటి విలువెంత?.. మా ఆస్తుల గోల మీకెందుకు అంటరా.. ఓకే..ఓకే! మరి, ప్రపంచం ఆస్తులెంతో ఇప్పటికే మీకు తెలిసే ఉంటుంది కదా. అవును మరి.. ప్రపంచంలో ఉన్న సంపద విలువ అక్షరాలా 256.18 కోట్ల కోట్ల రూపాయలు. అమెరికా డాలర్లలో చెప్పాలంటే 360.6 లక్షల కోట్ల డాలర్లు. ఇక్కడ ఆస్తులంటే బ్యాంకుల్లో ఉన్న డబ్బులు, కట్టుకున్న ఇళ్లు, ఆఫీసులే కాదు.. ఇంట్లో ఉండే ఫర్నిచర్, వాల్‌పెయింటింగ్స్, ఇతర చిన్న చిన్న వస్తువులు కూడా. అవును, క్రెడిట్ సూసీ అనే సంస్థ ప్రపంచంలోని ఆస్తులెంతో అంచనా వేసింది. అక్కడ పనిచేసే రీసెర్చర్లు ప్రతి విషయాన్నీ లెక్కలోకి తీసుకుని ఆస్తులను లెక్కగట్టారు. 2018తో పోలిస్తే 2019లో ప్రపంచం ఆస్తులు 6.4 కోట్ల కోట్ల రూపాయలు (9.1 లక్షల కోట్ల డాలర్లు) పెరిగాయట.
అమెరికా టాప్.. ఇండియా 7
ఈ జాబితాలో అగ్రరాజ్యంగా పిలిచే అమెరికానే ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. తన బిరుదుకు తగ్గట్టు ఆస్తుల్లో నిలబడింది. అమెరికాలో ఉన్న సంపద విలువ సుమారు రూ.75.3 కోట్ల కోట్లు (105.99 లక్షల కోట్ల డాలర్లు). ప్రపంచం మొత్తం సంపదలో అమెరికా వాటా దాదాపు 30%. టాప్‌టెన్ జాబితాలో ఇండియాకూ చోటు దక్కింది. 7వ స్థానంలో నిలిచింది. 8.95 కోట్ల కోట్ల రూపాయల ఆస్తులు ఇండియా సొంతం. ప్రపంచం ఆస్తుల్లో మన వాటా 3.5 శాతం. ఇక, రూ.45.34 కోట్ల కోట్లతో డ్రాగన్ కంట్రీ చైనా రెండో స్థానంలో దర్జాగా నిలబడింది. ఆ దేశ ఆస్తుల వాటా 17.7 శాతం. ఆస్తుల వాటాల్లో రెండంకెల శాతాన్ని దాటిన రెండే రెండు దేశాలు అమెరికా, చైనా మాత్రమే. ప్రపంచ సంపదలో దాదాపు సగం వాటా అమెరికా, చైనాలదే. మన దేశంలో మిలయనీర్ల సంఖ్య కూడా పెరిగిందని క్రెడిట్ సూసీ రిపోర్ట్ వెల్లడించింది. 2018లో 725 మంది మిలియనీర్లుంటే, 2019లో ఆ సంఖ్య 759కి పెరిగిందట. 2010లో కేవలం 34 మంది మాత్రమే మిలియనీర్లున్నారు. మొత్తంగా అమెరికాలో ఎక్కువగా 18,614 మంది మిలియనీర్లున్నారు. 4,447 మందితో చైనా సెకండ్ స్పాట్లో నిలిచింది. ప్రపంచం మొత్తంలో 46,792 మంది మిలియనీర్లున్నారు. 2018లో 45,647 మంది ఉండగా 2019 నాటికి 1,146 మంది పెరిగారు. ఇక, రీజియన్ల వారీగా చూస్తే రూ.వంద కోట్ల కోట్ల (141.21 లక్షల కోట్ల డాలర్లు)తో ఆసియా ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ప్రపంచ సంపద వాటాలో ఆసియా వాటా 39 శాతం.
టాప్ టెన్ దేశాలివే
అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్, ఇండియా, ఇటలీ, కెనడా, స్పెయిన్.
For More News..