
సగానికి పైగా తగ్గిన ఫేస్‌బుక్ జూకర్ బర్గ్ సంపద
భారీగా నష్టపోయిన మస్క్, బెజోస్‌లు..
అంబానీల సంపదే పైకి..
ఈ ఏడాది బిలియనీర్లకు గడ్డుకాలమనే చెప్పాలి. ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్, మార్క్ జూకర్ బర్గ్ వంటి ప్రపంచంలోని అత్యంత ధనవంతులు ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో రూ. వేల కోట్లు నష్టపోయారు. ముఖ్యంగా ఈ ధనవంతుల సంపద వారి కంపెనీల్లోని వాటాల రూపంలో ఉంది. ఈ కంపెనీల షేరు వాల్యూ పడిపోవడంతో వారి సంపద కూడా అమాంతం తగ్గింది. ఈ ఏడాది ఎలన్ మస్క్ సంపద ఏకంగా 62 బిలియన్ డాలర్లు (రూ. 4.9 లక్షల కోట్లు) తగ్గిందని అంచనా. జెఫ్ బెజోస్ 63 బిలియన్ డాలర్లు, మార్క్ జూకర్‌బర్గ్ సుమారు 64 బిలయన్ డాలర్లు కోల్పోయారు. మొత్తంగా చూస్తే ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో ప్రపంచంలోని టాప్ 500 మంది ధనవంతుల సంపద 1.4 లక్షల కోట్ల డాలర్లు (రూ. 111 లక్షల కోట్లు) తగ్గింది. గ్లోబల్ బిలియనీర్ల సంపద మొదటి ఆరు నెలల్లో ఇంతలా తగ్గడం ఇదే మొదటి సారి. కరోనా సంక్షోభంతో పాటు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో గ్లోబల్‌గా ఇన్‌ఫ్లేషన్ (ధరలు పెరుగుదల) పెరుగుతోంది. దీన్ని కంట్రోల్ చేయడానికి వివిధ దేశాల్లోని సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచడం స్టార్ట్ చేశాయి. ఈ ఎఫెక్ట్‌తో స్టాక్ మార్కెట్లు, క్రిప్టో కరెన్సీలు భారీగా పతనమయ్యాయి. ముఖ్యంగా టెక్ షేర్లకు ఈ ఏడాది గడ్డుకాలమే. మస్క్, బెజోస్‌లు ఈ ఏడాది ఎక్కువగానే నష్టపోయినప్పటికీ ఇంకా బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్‌లో టాప్ రెండు పొజిషన్లలో కొనసాగుతున్నారు. ఫ్రాన్స్ రిచెస్ట్ పర్సన్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఈ ఏడాది 49 బిలియన్ డాలర్లు నష్టపోయినప్పటికీ ధనవంతులు లిస్ట్‌లో టాప్ 3 పొజిషన్‌లో ఉన్నారు. 23 బిలియన్ డాలర్లు నష్టపోయిన బిల్‌గేట్స్ నాల్గో ప్లేస్‌లో కొనసాగుతున్నారు. మస్క్, బెజోస్, ఆర్నార్డ్, బిల్‌గేట్స్‌ల సంపద మాత్రమే 100 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో 100 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ సంపద ఉన్న బిలియనీర్ల సంఖ్య 10 గా ఉండేది. క్రిప్టో ఇండస్ట్రీకి చెందిన చాంగ్‌పెంగ్ జావ్ ఈ ఏడాది 96 బిలియన్ డాలర్లతో బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్‌లో చోటు
సంపాదించాడు. కానీ, క్రిప్టోల పతనంతో ఆయన సంపద ఏకంగా 80 బిలియన్ డాలర్లు తగ్గింది.
పేరు | తగ్గిన సంపద | మొత్తం సంపద (బి.డాలర్లలో) |
ఎలన్ మస్క్ | 62 | 208 |
జెఫ్‌బెజోస్ | 63 | 130 |
బెర్నార్డ్ ఆర్నాల్ట్ | 49 | 129 |
బిల్‌గేట్స్ | 23 | 115 |
ల్యారి పేజ్ | 29 | 99 |
సెర్జీ బ్రిన్ | 28 | 95 |
వారెన్ బఫెట్ | 14 | 94 |
స్టీవ్ బామర్ | 15 | 91 |
టాప్ 10 లో కేవలం ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీల సంపద మాత్రమే పెరిగింది. అదానీ సంపద (99 బిలియన్ డాలర్లు) ఈ ఏడాది మొదటి 6 నెలల్లో 22.1 బిలియన్ డాలర్లు పెరగగా, అంబానీ సంపద 3 బిలియన్ డాలర్లు పెరిగి 93 బిలియన్ డాలర్లకు చేరుకుంది.