రిట్స్​ను ఆజ్ఞలు లేదా ఆదేశాలు అంటారు

రిట్స్​ను ఆజ్ఞలు లేదా ఆదేశాలు అంటారు

రిట్లు జారీ చేసే విధానాన్ని బ్రిటన్ నుంచి గ్రహించారు. వీటిని బ్రిటన్ లో విశిష్ట ఆదేశాలు అంటారు. రిట్స్​ను ఆజ్ఞలు లేదా ఆదేశాలు అంటారు. బ్రిటన్​లో సాధారణ న్యాయాన్ని పొందనప్పుడు రాజు అసాధారణ రెమెడీ కోసం ఈ రిట్లను జారీ చేస్తారు. కాబట్టి వీటిని ఫౌంటేన్​ ఆఫ్​ జస్టిస్​ అంటారు. 1950కు ముందు కలకత్తా, ముంబయి, మద్రాస్​ హైకోర్టులకు మాత్రమే రిట్లు జారీ చేసే అధికారం ఉండేది. రాజ్యాంగంలో అమలులోకి వచ్చిన తర్వాత ఆర్టికల్​ 226 ప్రకారం అన్ని హైకోర్టులకు రిట్లు జారీ చేసే అధికారం కల్పించారు. 

హెబియస్​ కార్పస్​: ఇది ప్రాచీనమైన రిట్​గా భావిస్తారు. దీనికి లాటిన్​ భాషలో అర్థం శరీరాన్ని కలిగి ఉండటం, హెబియస్​ అంటే కలిగి ఉండుట, కార్పస్​ అంటే శరీరం. ఈ రిట్టును చట్ట విరుద్ధంగా నిర్బంధించిన వ్యక్తిని 24గంటల్లోగా భౌతికంగా సమీప న్యాయస్థానం ఎదుట హాజరుపరచమని, అరెస్ట్​ చట్టబద్ధత తెలపమని, అరెస్టుకు గల కారణాలను తెలపమని జారీ చేస్తారు. 

మాండమస్​: మాండమస్​ అనే పదానికి అర్థం మేము ఆదేశిస్తున్నాం. ఒక ప్రభుత్వాధికారి తను నిర్వర్తించాల్సిన విధులను నిర్వహించకపోతే మాండమస్​ రిట్టు జారీ చేస్తారు ఈ రిట్టును ఒక ప్రభుత్వ సంస్థపైగాని, కార్పొరేషన్​ సంస్థపైగాని ఏదైనా కింది కోర్టుపై గాని, ట్రిబ్యునల్​పై గాని, మంత్రి మండలిపై గాని జారీ చేయవచ్చు. ఈ రిట్​ జారీ కోర్టుల విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది.

ప్రొహిబిషన్​: ఈ పదానికి అర్థం నిషేధించడం. ఒక కింది కోర్టు లేదా ట్రిబ్యునల్​ తన పరిధిలో లేని ఏదైనా కేసు పరిశీలిస్తూ ఉంటే తదుపరి ఆదేశాల వరకు ఆ పరిశీలన నిలిపివేయమని ఉన్నత న్యాయస్థానం ఈ రిట్టు జారీ చేస్తుంది. పరిశీలన నిలిపివేసి ఈ కేసును మరో కోర్టుకు బదిలీ చేస్తారు. లేక రిట్​ జారీ చేసిన కోర్టు స్వయంగా ఈ కేసును పరిశీలిస్తుంది. 

సెర్షియారరి: ఈ పదానికి అర్థం టు బి సర్టిఫైడ్​. ఒక కింది కోర్టు లేదా ట్రిబ్యునల్​ ఇచ్చిన తీర్పు న్యాయబద్ధంగా లేనప్పుడు గాని ఆ కేసును ఆ కోర్టు పరిధిలో లేనప్పుడు గాని ఈ రిట్టును ఉన్నత న్యాయస్థానం జారీ చేసి ఆ తీర్పును రద్దు చేస్తుంది.

కోవరెంటో: అర్హత లేని వ్యక్తి ప్రజా సంబంధమైన పదవుల్లోకి ప్రవేశించినా లేదా ప్రజా సంబంధమైన పదవుల్లో ఉన్న వ్యక్తి ఆ పదవిని దుర్వినియోగపరిచినా ఆ వ్యక్తికి ఉన్న చట్టబద్ధమైన అధికారాన్నిఈ రిట్​ ద్వారా న్యాయస్థానాలు ప్రశ్నిస్తాయి.