ద్రవిడ్ మంచి ఆటగాడు.. కోచ్‌గా చేసే టాలెంట్ మాత్రం లేదు: పాక్ మాజీ క్రికెటర్

ద్రవిడ్ మంచి ఆటగాడు.. కోచ్‌గా చేసే టాలెంట్ మాత్రం లేదు: పాక్ మాజీ క్రికెటర్

డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత ఆటగాళ్ల ప్రదర్శన జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌పై విమర్శలకు దారితీస్తోంది. కీలక మ్యాచులో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం, ఆటగాళ్ల ఫిట్ నెస్, ఫీల్డింగ్ వైఫల్యాలు వంటి ఘటనలు కోచ్‌గా ద్రావిడ్ తీసుకున్న నిర్ణయాలను ఎత్తిచూపుతున్నాయి. ఈ నేపథ్యంలో 'ది వాల్'పై పాక్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ విమర్శల వర్షం కురింపించాడు. 'ఆటగాడిగా ద్రావిడ్ గొప్పోడే అయినప్పటికీ.. కోచ్‌గా మాత్రం సున్నా' అని బాసిత్ అలీ వెల్లడించాడు. 

"ఫైనల్ మ్యాచులో టాస్ గెలవడం భారత్ కు కలిసొచ్చేఅంశం. కానీ వారు తొలి రెండు గంటల గురించి అలోచించి బౌలింగ్ ఎంచుకున్నారు. అది తొందరపాటు చర్య.. అప్పుడే ఈ మ్యాచ్ చేజారింది. ఇక భారత్ బౌలింగ్ లైనప్ ఐపీఎల్‌లో లానే ఉంది. లంచ్ సమయానికే బౌలర్లు చాలా హ్యాపీగా మ్యాచ్ గెలిచేసినట్లు కనిపించారు. ఇప్పుడు వారి ముందున్నది ఒక్కటే మార్గం. వీలైనంత తొందరగా ఆసీస్ ను ఔట్ చేసి.. బ్యాటింగ్‌లో అద్భుతాలు సృష్టించడం. ఆటగాళ్లు కూడా ఎవరూ ఫిట్ గా కనిపించడం లేదు. కోహ్లీ, జడేజా, రహానే మినహా అందరూ అలసిపోయినట్లు కనిపించారు" అని బాసిత్ అలీ పేర్కొన్నాడు. 

ఇక ద్రవిడ్‌ గురించి మాట్లాడుతూ.."నేను రాహల్‌ ద్రవిడ్‌కు వీరాభిమానిని. ఈ విషయాన్ని గతంలోనూ చెప్పాను. అతనొక క్లాస్‌ ప్లేయర్‌.. లెజెండ్‌. కానీ కోచ్‌గా మాత్రం అతడు జీరో. ఆసీస్ జట్టు భారత పర్యటనకు వచ్చినపుడు టర్నింగ్ పిచ్‌లు తయారు చేయించారు. నాకు ఒక్క సమాధానం చెప్పండి. టీమిండియా.. ఆస్ట్రేలియా వెళ్లినప్పుడు అక్కడ అలాంటి పిచ్‌లే ఉన్నాయా? బౌన్సీ పిచ్‌లు ఉన్నాయా? ద్రవిడ్‌ ఏమీ ఆలోచిస్తున్నాడో ఆ దేవుడికే తెలియాలి. దేవుడు అందరికీ బుద్ధి ప్రసాదిస్తున్నప్పుడు ఇతడు ఎక్కడ దాక్కున్నాడో(జబ్ ఉపర్ వాలా అకల్ బాంత్ రహా థా తో పతా నహీ కహా పహాడో కే పీచే చుపే హుయే).." అంటూ బాసిత్ అలీ తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నాడు.