టీమిండియా టార్గెట్ 444.. చేధిస్తే వందేళ్ల చరిత్ర తిరగరాసినట్లే!

టీమిండియా టార్గెట్ 444.. చేధిస్తే వందేళ్ల చరిత్ర తిరగరాసినట్లే!

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌ రెండో ఇన్నింగ్స్‌ని 270/8 పరుగుల వద్ద ఆస్ట్రేలియా డిక్లేర్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన 173 పరుగుల ఆధిక్యంతో కలిపి మొత్తంగా భారత్ ముందు 444 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టీమిండియా విజేతగా నిలవడానికి ఐదు సెషన్లు మాత్రమే మిగిలివున్నాయి. 137 ఓవర్లలో టార్గెట్ చేధించాలి. ఒకవేళ భారత జట్టు లక్ష్యాన్ని చేధించినట్లయితే 121 ఏళ్ల చరిత్ర తిరగరాసిన జట్టుగా అవతరించనుంది. 

123/4తో నాలుగో రోజు ఆట ఆరంభించిన ఆసీస్ తొలి సెషన్‌లోనే మార్నస్ లబుషేన్ వికెట్ కోల్పోయింది. 41 పరుగుల వద్ద లబుషేన్‌ను ఉమేశ్ యాదవ్  ఔట్ చేయగా, 25 పరుగుల వద్ద కామెరూన్ గ్రీన్‌ను రవీంద్ర జడేజా క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ఆసీస్ ఇన్నింగ్స్ త్వరగానే ముగిసేటట్లు కనిపించినప్పటికీ.. అలెక్స్ క్యారీ(66) అడ్డుపడ్డాడు. క్యారీ - మిచెల్ స్టార్క్ జోడి ఏడో వికెట్ కు 93 పరుగులు జోడించారు. అయితే షమీ అద్భుతమైన బంతితో స్టార్క్(41)ను  పెవిలియన్‌కు పంపగా , భారీ షాట్‌కు ప్ర‌య‌త్నించి  ప్యాట్ క‌మిన్స్(5) అక్ష‌ర్ ప‌టేల్ చేతికి చిక్కాడు. ఆ వెంట‌నే క‌మిన్స్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించాడు.  భారత బౌలర్లలో రవీంద్ర జడేజాకి 3 వికెట్లు దక్కగా ఉమేశ్ యాదవ్, షమీ రెండేసి వికెట్లు తీశారు. సిరాజ్‌కి ఓ వికెట్ దక్కింది.