ఐపీఎల్‌పై ప్రశంసలు.. ఐసీసీపై విమర్శలు: ఓటమిపై స్పందించిన రోహిత్ శర్మ

ఐపీఎల్‌పై ప్రశంసలు.. ఐసీసీపై విమర్శలు: ఓటమిపై స్పందించిన రోహిత్ శర్మ

ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమిండియా 209 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో చెలరేగి ఆడే భారత క్రికెటర్లు.. ఓవల్ పిచ్‌పై నిలబడటానికే నానా అవస్థలు పడ్డారు. కనీసం పోరాడే ప్రయత్నం కూడా చేయకుండానే ఆసీస్‌కు విజయాన్ని కట్టబెట్టారు. ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న రోహిత్.. ఓటమిని గల కారణాలను వెల్లడిస్తూనే.. ఐసీసీ తీరును ప్రశ్నించాడు. 

అలాంటి టెక్నాలజీ ఎందుకు లేదు.. 

భారత బ్యాటింగ్ రెండో ఇన్నింగ్స్‌లో శుభ్‌మాన్ గిల్ వివాదాస్పద రీతిలో ఔటైన సంగతి తెలిసిందే. కామెరూన్ గ్రీన్ పట్టిన క్యాచ్, నేలను తాకుతున్నట్టు టీవీ రిప్లైలో స్పష్టంగా కనిపించినప్పటికీ.. థర్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించడం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ విషయంపై స్పందించిన హిట్ మ్యాన్.. ఐసీసీ టోర్నీల్లో వాడే టెక్నాలజీని ఎండగట్టాడు. 'ఐపీఎల్‌లో 10 రకాలుగా విభిన్నమైన యాంగిల్స్‌లో చూపించే కెమెరాలున్నాయి.  అలాంటి సదుపాయాలు ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ వంటి టోర్నీల్లో ఎందుకు లేవో నాకు అర్థం కావడం లేదు. గిల్ క్యాచ్‌‌ను.. అల్ట్రా మోక్షన్, జూమ్ ఇన్ యాంగిల్స్‌లో చూపించివుంటే నాటౌట్‌గా  తేలేది..' అంటూ  ఐసీసీ తీరుపై రోహిత్ అసహనం వ్యక్తం చేశాడు. 

ఇంగ్లండ్‌లోనే నిర్వహించాలన్న రూల్ లేదు

డబ్ల్యూటీసీ విజేతను ఒక మ్యాచ్‌తో నిర్ణయించడం సరికాదన్న రోహిత్ శర్మ, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ ద్వారా ఛాంపియన్‌షిప్ విజేతను తేల్చడం సరైన పద్ధతని వెల్లడించాడు. అలాగే డబ్ల్యూటీసీ ఫైనల్ ఇంగ్లండ్‌లోనే నిర్వహించాలనే రూల్ లేదని, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఈ మ్యాచ్‌ నిర్వహించవచ్చని ఐసీసీకి సూచనలు చేశాడు. 

కాగా, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియాకు ఇది రెండో ఓటమి. 2019-21 సర్కిల్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలవ్వగా,ఇప్పుడు ఆసీస్ చేతిలో ఓటమిని చవిచూసింది. ఐసీసీ ప్రతి రెండేళ్లకోసారి ఈ టోర్నీ నిర్వహిస్తోంది.