యాపిల్‌‌ను దాటేసిన షావోమీ

యాపిల్‌‌ను దాటేసిన షావోమీ
  • రెండో అతిపెద్ద ఫోన్‌‌ కంపెనీగా రికార్డ్‌‌
  • 19 శాతం వాటాతో ఫస్ట్‌‌ప్లేసులో శామ్‌‌సంగ్‌‌
  • 3వ స్థానంలో నిలిచిన యాపిల్‌‌
  • 4,5 స్థానాల్లో వివో, ఒప్పో

న్యూఢిల్లీ: స్మార్ట్‌‌ఫోన్‌‌ మార్కెట్లో చైనీస్‌‌ ఎలక్ట్రానిక్స్‌‌ కంపెనీ షావోమీ దూకుడు తగ్గడం లేదు. ఎంఐ 11 అల్ట్రా  వంటి దాని హై-ఎండ్ ఫోన్ల అమ్మకాలను పెంచడం ద్వారా భారీ విజయాలు సాధిస్తోంది. గత ఏడాది రెండో క్వార్టర్లో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద స్మార్ట్‌‌ఫోన్ తయారీదారుగా షావోమీ రికార్డు సాధించింది. అమ్మకాల్లో యాపిల్‌‌ను కూడా దాటేసిందని మార్కెట్ రీసెర్చ్‌‌ ఫర్మ్‌‌ కెనాలిస్ స్టడీ రిపోర్టు తెలిపింది. లాటిన్ అమెరికన్, ఆఫ్రికా,  పశ్చిమ యూరోపియన్ ప్రాంతాలలో కంపెనీ ఎగుమతులు గత సంవత్సరంతో పోలిస్తే వరుసగా 300శాతం, 150శాతం,  50శాతం పెరిగాయని కెనాలిస్  సీనియర్‌‌ ఎగ్జిక్యూటివ్‌‌ బెన్ స్టాంటన్ వెల్లడించారు. తాజా రీసెర్చ్‌‌ రిపోర్టు ప్రకారం,   స్మార్ట్‌‌ఫోన్ షిప్‌‌మెంట్లను19 శాతం పెంచడం ద్వారా శామ్‌‌సంగ్‌‌ మార్కెట్‌‌ లీడర్‌‌గా నిలిచింది. గత ఆర్థిక సంవత్సరంలో 15 శాతం గ్రోత్‌‌ సాధించింది.  షావోమీ బిజినెస్‌‌ 83 శాతం పెరగడంతో మార్కెట్ వాటా 17శాతానికి ఎదిగింది. యాపిల్‌‌  14 శాతం వాటాకు పరిమితమయింది. ఒప్పో,  వివో వరుసగా నాలుగు,  ఐదవ స్థానాలను సాధించాయి, వీటిలో ఒక్కొక్కదానికి 10శాతం మార్కెట్ వాటా ఉంది. గత ఏడాది క్యూ 2లో గ్లోబల్‌‌ షిప్‌‌మెంట్లు సీక్వెన్షియల్‌‌గా12శాతం పెరిగాయి. అయితే రెండో క్వార్టర్లో షావోమీ అమ్మకాలు పెరగడం మామూలేనని ఎనలిస్టులు అంటున్నారు. ఎందుకంటే యాపిల్‌‌ ఏటా మూడో క్వార్టర్‌‌లో కొత్త ఫోన్లను రిలీజ్‌‌ చేస్తుంది. కస్టమర్లు వాటిని కొనుగోలు చేయడానికి ఎదురుచూస్తుంటారు. ఒప్పో, వివో  రియల్‌‌మీ వంటి తోటి చైనా కంపెనీల నుంచి కూడా షావోమీ గట్టి పోటీని ఎదుర్కుంటోంది.  అయితే శామ్‌‌సంగ్‌‌,  యాపిల్‌‌తో పోలిస్తే, షావోమీ సగటు ధరలు వరుసగా 40 శాతం, 75 శాతం తక్కువగా ఉంటాయి. 

సోనూసూద్‌‌ ఫౌండేషన్‌‌తో జోడీ
ఇండియాలో తన ఏడో బర్త్‌‌ డే సందర్భంగా షావోమీ  సోనూ సూద్ ఫౌండేషన్‌‌తో చేతులు కలిపింది. రెండు సంస్థలు కలిసి కరోనా బాధితుల కోసం  ‘శిక్షా హర్‌‌ హాత్’ కార్యక్రమం నిర్వహిస్తాయి. కరోనా వల్ల తల్లిదండ్రుల మరణంతో అనాథలుగా మారిన బాలల విద్యకు సపోర్ట్‌‌ చేస్తాయి. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవాలనే ఆలోచనతో సోనూ సూద్ ఫౌండేషన్ (ఎస్ఎస్ఎఫ్)తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని కంపెనీ ప్రకటించింది. శిక్షా హర్‌‌ హాత్ కింద ఎంపికైన  అనాథబాలలు 10వ తరగతి వరకు చదివేందుకు డబ్బులు ఇస్తారు.  ఇందుకోసం రానున్న మూడు నెలల్లో అప్లికేషన్లు తీసుకుంటారు. ఈ విషయం గురించి సోనూ సూద్ మాట్లాడుతూ ‘‘అనాథలకు మంచి భవిష్యత్తును అందించేందుకు, వాళ్ల చదువుకు షావోమీ ఇండియాతో చేసుకున్న ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది. దేశమంతటా నిరక్షరాస్యతను తగ్గించడం,  ఆన్‌‌లైన్ విద్యను పెంచడం కోసం కూడా మేం పనిచేస్తాం’’ అని ఆయన అన్నారు.