- యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు
యాదగిరిగుట్ట, వెలుగు: అన్ని రకాల వైద్య సదుపాయాలు ఉన్న ప్రభుత్వ హాస్పిటళ్లలోనే ప్రసవాలు చేసుకోవాలని గర్భిణులకు కలెక్టర్ హనుమంతరావు సూచించారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని గుండ్లపల్లిలో నిర్వహించిన ‘అమ్మకు భరోసా’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రసవానికి సిద్ధంగా ఉన్న పూజిత అనే గర్భిణీనికలిసి ఆరోగ్యం ఎలా ఉందని.? సమయానికి భోజనం చేస్తున్నారా.? మందులు వేసుకుంటున్నావా.? అని ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమెకు న్యూట్రిషన్ కిట్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్కార్ దవాఖానలో ప్రసవాలు చేసుకోవాలని, తల్లి, బిడ్డకు అవసరమైన మందులు, టీకాలు ఉచితంగా అందుతాయని తెలిపారు.
హిమోగ్లోబిన్ శాతం తక్కువుంటే డాక్టర్ల సూచనతో ఐరన్ ట్యాబ్లెట్స్ లేదా ఇంజక్షన్ రూపంలో తీసుకోవాలన్నారు. ఇక కాన్పు అయిన గంటలోపు బిడ్డకు ముర్రు పాలను తప్పకుండా ఇవ్వాలని సూచించారు. నెలలో ఒకరోజు తప్పకుండా 'అమ్మకు భరోసా' కార్యక్రమాన్ని నిర్వహించి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు జరిగేలా చర్యలు చేపట్టాలని వైద్యాధికారులను ఆదేశించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ మనోహర్, మండల వైద్యాధికారి డాక్టర్ పావని, ఎంఈవో శరత్ యామిని, స్కూల్ స్టాఫ్, పీహెచ్‌సీ సిబ్బంది తదితరులు ఉన్నారు.
పనుల్లో అలసత్వం వద్దు
అభివృద్ధి పనుల పట్ల అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. యాదగిరిగుట్టలోని జిల్లా పరిషత్ హైస్కూల్‌ను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కిచెన్ పనులను పరిశీలించి, పనులు నత్తనడకన నడుస్తుండడం పట్ల పంచాయతీ రాజ్ ఏఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం లోపు కిచెన్ పెండింగ్ పనులు పూర్తి చేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదో తరగతి వార్షిక పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేకంగా బోధించాలని చెప్పారు.
