
- కలెక్టర్ హనుమంత రావు
యాదాద్రి, వెలుగు: ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయం, పరిశ్రమలకు పెద్ద ఎత్తున రుణాలు మంజూరు చేస్తున్నామని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. దీర్ఘకాలిక రుణాలుగా రూ. 1028.63 కోట్లు అందించామని వెల్లడించారు. ఇందులో రూ. 467.61 కోట్లు పంట రుణాలు పంపిణీ చేశామని వివరించారు. కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమీక్ష కమిటీ, జిల్లా స్థాయి సమీక్ష కమిటీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. వ్యవసాయ రుణాల వార్షిక లక్ష్యంలో ఇప్పటికే 23.69 శాతం సాధించామని చెప్పారు.
ఎంస్ఎంఈ రంగంలో రూ. 281.78 కోట్లు ఇచ్చామని, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊతమివ్వడానికి ఇప్పటికే రూ. 1323.92 (24.55 శాతం) అందించామని తెలిపారు. పీఎంఎంవై రూ. 63.54 కోట్లు, స్వయం సహాయక సంఘాలకు రూ. 219.25 కోట్లు, మెప్మా కింద రూ. 19.29 కోట్లు రుణాలు మంజూరు చేసినట్టు చెప్పారు.
పత్తి విక్రయాల్లో ఆధార్ తప్పనిసరి
సీసీఐ సెంటర్లో పత్తి అమ్మాలంటే ఆధార్ తప్పనిసరని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. ఆధార్‌తో అనుసంధానమైన బ్యాంక్ అకౌంట్లోనే డబ్బు జమ అవుతుందని అన్నారు. పత్తి, వరి కొనుగోలుకు సంబంధించి జరిగిన రివ్యూ మీటింగ్‌లో ఆయా పంటల సాగు వివరాలను ఆఫీసర్లు వివరించారు.