
- ఎంపీటీసీ స్థానాలు మొత్తం 76
- 7 చొప్పున జడ్పీటీసీ, ఎంపీపీ సీట్లు
- వార్డులు 1,528
- యాదాద్రి జిల్లాలో 421 గ్రామ పంచాయతీలు
యాదాద్రి, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కారణంగా వారు పోటీ చేసే సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. యాదాద్రి జడ్పీ పీఠం బీసీ మహిళకు రిజర్వ్అయింది. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో పేర్కొన్నట్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను పెంచుతూ ప్రభుత్వం గత నెల 29న నిర్ణయం తీసుకుంది. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీలకు సీట్లను కేటాయించారు. గతేడాది నిర్వహించిన కులగణన సర్వే ఆధారంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఖరారు చేశారు. అనంతరం లాటరీ పద్ధతిలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు.
కొత్తగా పెరిగిన పంచాయతీలు 7
యాదాద్రి జిల్లాలో గతంలో 421 గ్రామ పంచాయతీలు ఉండగా కొత్తగా 7 పెరిగాయి. అయితే భూదాన్ పోచంపల్లి మండలంలోని సాయినగర్ పంచాయతీని పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీలో విలీనం చేశారు. దీంతో పంచాయతీల సంఖ్య 427కు చేరింది. గత పంచాయతీ ఎన్నికల్లో అప్పటి రిజర్వేషన్ ప్రకారం బీసీలకు113 సీట్లు దక్కాయి. కొన్ని జనరల్ సీట్లలోనూ అప్పట్లో బీసీలు పోటీ చేసి గెలిచారు. ఈసారి జరిగే ఎన్నికల్లో వారికి 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో ప్రస్తుతం ఆ సంఖ్య 164కు చేరింది. ఈ లెక్కన బీసీలకు 51 సీట్లు అదనంగా దక్కినట్లయింది. మొత్తం సీట్లలో 79 బీసీ మహిళలకు, 3,704 వార్డుల్లో బీసీలకు 1,528 వార్డులను కేటాయించారు. వీటిలో మహిళలకు 677 వార్డులను రిజర్వ్‌చేశారు.
17 మండలాలు..
జిల్లాలో 17 మండలాలు ఉండగా.. జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు మారలేదు. జిల్లా ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి జిల్లా పరిషత్ ఎన్నికల్లో చైర్మన్ పదవి జనరల్‌కు రిజర్వ్ అయింది. ఈసారి బీసీ మహిళకు కేటాయించారు. గత ఎన్నికల్లో బీసీలకు 5 ఎంపీపీలు ఉండగా.. ఈసారి 7కు చేరాయి. అలాగే జడ్పీటీసీ స్థానాలు 4 ఉండగా 7కు చేరాయి. పెరిగిన సీట్లు అన్ రిజర్వ్డ్ స్థానాల నుంచి బీసీల ఖాతాలో చేరాయి.
177 ఎంపీటీసీ స్థానాలు..
జిల్లాలో గతంలో 177 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. ఒకటి పెరిగి178కు చేరాయి. వీటిలో అప్పటి రిజర్వేషన్ల ప్రకారం బీసీలకు 39 సీట్లు రిజర్వ్అయ్యాయి. తాజాగా కల్పించిన 42 శాతం రిజర్వేషన్ల వల్ల 76 సీట్లు కేటాయించారు. ఈ లెక్కన బీసీలకు గతం కంటే 37 సీట్లు ఎక్కువగా దక్కాయి. మొత్తం సీట్లలో 34 ఎంపీటీసీలు బీసీ మహిళలకు, 42 బీసీ జనరల్‌కు రిజర్వ్అయ్యాయి.
కొత్త పంచాయతీల్లో..
జిల్లాలోని 7 కొత్త పంచాయతీల్లోనూ బీసీలకే ఎక్కువగా రిజర్వ్ అయ్యాయి. ఆలేరు మండలంలో కొత్తగా ఏర్పడిన బైరామ్ నగర్ బీసీ(జనరల్), సాయిగూడెం ఎస్సీ(మహిళ), బొమ్మల రామారంలోని కాజీపేట బీసీ(మహిళ), మోటకొండూరులోని ఆబిద్నగర్అన్రిజర్వ్డ్, పెద్దబావి బీసీ(మహిళ), తుర్కపల్లిలోని గుజ్జవాని కుంట ఎస్టీ (మహిళ), ఇందిరా నగర్ బీసీ(జనరల్)కి కేటాయించారు.