
- షాపులకు వంద టన్నులు, పీఏసీఎస్‌లకు 400 టన్నుల పంపిణీ
యాదాద్రి, వెలుగు: యూరియా కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలిస్తున్నాయి. ఇందులో భాగంగా యాదాద్రి జిల్లాకు యూరియా చేరుకుంటోంది. వచ్చిన స్టాక్‌కు వచ్చినట్టే పీఏసీఎస్‌లు, షాపులకు తరలిస్తున్నారు. యాదాద్రి జిల్లాలో వానాకాలం సీజన్ పంటల సాగు కోసం మొత్తంగా 32,830 టన్నులు అవసరం పడుతుందని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లెక్కలు వేసింది. వానాకాలం సీజన్ మొత్తంలో జులై, ఆగస్టు నెలల్లోనే యూరియా వాడకం ఎక్కువగా ఉంటోంది.
అయితే గడిచిన సీజన్‌కు సంబంధించిన 6302 టన్నుల యూరియా స్టాక్ ఉండడంతో ఇంకా 26,528 టన్నుల యూరియా జిల్లాకు రావాల్సి ఉంది. అయితే అవసరమైన మేరకు యూరియా సప్లయ్ కాలేదు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇండెంట్ ప్రకారం ఆగస్టు వరకూ 29,546.52 టన్నుల యూరియా రావాల్సి ఉంది. ఆగస్టు నెలాఖరు వరకూ ఇప్పటివరకూ 18,769 టన్నుల యూరియా మాత్రమే రావడంతో 10,777 టన్నుల కొరత ఏర్పడింది. దీంతో డిమాండ్.. సప్లయ్‌కు మధ్య అంతరం ఏర్పడింది. ఈ పరిణామంతో జిల్లాలో యూరియా కొనుగోలు చేయడానికి రైతులు లైన్లు కడుతున్నారు.
తాజాగా 500 టన్నులు
యూరియా కోసం రైతులు క్యూ కడుతూ ఉండడంతో కొరతను అధిగమించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో బుధవారం 500 టన్నుల యూరియా జిల్లాలోని నాగిరెడ్డిపల్లి గోడౌన్‌కు వచ్చింది. యూరియాలో పీఏసీఎస్‌లకు 400 టన్నులు, డీలర్లకు వంద టన్నుల యూరియాను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కేటాయించింది. గురువారం మరో 500 టన్నుల యూరియా వస్తుందని ఆఫీసర్లు తెలిపారు.
జిల్లా యూరియా ఇండెంట్ ఇప్పటి వరకూ వచ్చిన రావాల్సింది
యాదాద్రి 32,830 19,269 13,561
కొరత లేకుండా చర్యలు
యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. అవసరమైన స్థాయిలో స్టాక్ ఎప్పటికప్పుడు తెప్పిస్తున్నాం. తక్కువ రేటున్న నానో యూరియా వాడాలని కూడా సూచిస్తున్నాం. ఎవరైనా యూరియా పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తే చర్యలు తీసుకుంటాం. హనుమంతరావు, కలెక్టర్, యాదాద్రి