
- 30 రోజుల్లో10 రోజులు వానలే
- 1900 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు
- యాదాద్రిని వెంటాడుతున్న వడగండ్లు
యాదాద్రి, వెలుగు : అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. యాదాద్రి జిల్లాను వడగండ్ల వాన వెంటాడుతోంది. నెలరోజుల్లోనే కురిసిన వడగండ్ల వాన కారణంగా రైతులకు భారీ నష్టం వాటిల్లింది. దీంతో రూ.14.70 కోట్ల విలువైన పంట రైతులు నష్టపోయారు.
గత నెల 3 నుంచి..10 రోజులు వానలు..
పంట చేతికొచ్చి.. పైసలు చేతికందే దశలో ప్రకృతి కన్నెర్ర జేసింది. గత నెల 3న జిల్లాలో ప్రారంభమైన వడగండ్ల వాన ఈనెల 2 వరకు జిల్లాను అతలాకుతలం చేసింది. సరిగ్గా నెల రోజుల్లో జిల్లాలో పది రోజులు ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. తుర్కపల్లి, బొమ్మలరామారం, ఆలేరు, అడ్డగూడూరు, గుండాల, మోటకొండూరు, ఆత్మకూరు (ఎం), రామన్నపేట, చౌటుప్పల్, బీబీనగర్, భువనగిరి మండలాల్లోని 55 గ్రామాల్లో వడగండ్ల వాన కురిసింది.
1400 మంది రైతులు, 1900 ఎకరాలు..
పది రోజులపాటు వివిధ గ్రామాల్లో కురిసిన వడగండ్ల వాన కారణంగా పెద్ద ఎత్తున పంట నష్టం జరిగిందని అగ్రికల్చర్ ఆఫీసర్లు గుర్తించారు. 55 గ్రామాల్లోని 1400 మంది రైతులు తమ పంటలను నష్టపోయారని తేల్చారు. వరి కోతలు ప్రారంభమైన సమయంలోనే వానలు కురవడంతో వరి పంట దెబ్బతిన్నది.
మొత్తంగా 1900 ఎకరాల్లో పంట నష్టపోగా, ఇందులో 1500 ఎకరాల వరి, 420 ఎకరాల్లో మామిడి తోటలకు నష్టం జరిగిందని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నివేదిక రూపొందించింది. పంట నష్టపోయిన రైతుల పేర్లు, సర్వే నంబర్లతో సహా ఎన్ని ఎకరాల్లో పంట నష్టపోయారో లెక్కలు తీశారు. రైతు అకౌంట్ నంబర్లు కూడా సేకరించి రూపొందించిన నివేదికను పైఆఫీసర్లకు పంపించనుంది.
రూ.14.70 కోట్ల నష్టం..
కోతకు వచ్చిన వరి పంట దెబ్బతినడంతో రైతులకు భారీ నష్టం జరిగింది. ఇప్పటివరకు 1500 ఎకరాల్లో రైతులు వరి పంట నష్టపోయారు. ఎకరానికి 25 క్వింటాళ్ల చొప్పున 1500 ఎకరాల్లో 3,750 టన్నుల వడ్ల దిగుబడి వస్తుంది. క్వింటాల్‌కు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం రూ.8.70 కోట్లు నష్టం వాటిల్లినట్టయింది. అదేవిధంగా 420 ఎకరాల్లో మామిడికాయలు నెలరాలాయి. ఎకరానికి రెండు టన్నుల మామిడి దిగుబడి వస్తుందని, ఈ లెక్కన 840 టన్నుల మామిడి దిగుబడి వస్తుంది. మార్కెట్లో టన్నుకు రూ. 70 వేల చొప్పున ధర పలుకుతోంది. ఈ లెక్కన రూ.6 కోట్ల నష్టం వాటిల్లినట్టయిందని రైతులు చెబుతున్నారు.