యాదాద్రిలో 264 నామినేషన్లు

యాదాద్రిలో 264 నామినేషన్లు
  • చౌటుప్పల్​లో బీఆర్​ఎస్​, సీపీఎం పొత్తు

యాదాద్రి, వెలుగు:  యాదాద్రి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో గురువారం భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. 104 వార్డుల్లో 264 మంది నామినేషన్లను దాఖలు చేశారు. ఇందులో కొందరు రెండు సెట్ల చొప్పున నామినేషన్లు వేశారు. బీజేపీ తరఫున 70 నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్​ తరపున 101 దాఖలు కాగా బీఆర్​ఎస్​ తరపున 90 దాఖలయ్యాయి. 

సీపీఎం తరఫున 3, రిజిస్టర్డ్  పార్టీల తరఫున 10, ఇండిపెండెంట్లు 33 నామినేషన్లు దాఖలయ్యాయి.  వీటిలో బుధవారం 41 నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా ఆలేరు మున్సిపాలిటీలో సీపీఎం, కాంగ్రెస్​ మధ్య అవగాహన కుదుర్చుకునే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఆలేరులో 12 వార్డులు ఉండగా సీపీఎం నాలుగో వార్డుల్లో పోటీ చేస్తామని కాంగ్రెస్​వద్ద ప్రతిపాదన చేసింది.  

ఆ వార్డులో తమ అభ్యర్థిని ఇప్పటికే ఎంపిక చేశామని డీసీసీ అధ్యక్షుడు, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య స్పష్టం చేశారు.  కలిసి వస్తే కో ఆప్షన్ పదవి​ఇస్తామని ప్రపోజల్​ చేసినట్టుగా చెబుతున్నారు. అయితే సీపీఎం మాత్రం ప్రతి మున్సిపాలిటీలో పోటీ చేయాలని పార్టీ నిర్ణయం తీసుకుందని, తాము పోటీ చేస్తామని తెలిపింది. ఈ విషయంలో  రెండు పార్టీల్లో ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. 

చౌటుప్పల్​లో బీఆర్​ఎస్​, సీపీఎం మధ్య పొత్తు కుదిరింది.  సీపీఎం మూడు వార్డుల్లో పోటీ చేస్తుండగా, బీఆర్‌‌‌‌ఎస్‌‌ 17 వార్డుల్లో పోటీ చేస్తోంది. ఒంటరిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్​ 20 వార్డుల్లో అభ్యర్థులను ఖరారు చేసింది. బీజేపీ ఇప్పటివరకూ 7 వార్డుల్లో అభ్యర్థులను ఎంపిక చేసింది.  భువనగిరిలో 22 వార్డులకు అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్​, పోచంపల్లిలో 9 మంది అభ్యర్థులను ఖరారు చేసింది.