
- ఐకేపీకే ప్రా'ధాన్యం'
- 4.58 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా
- యాదాద్రి జిల్లాలో 325 సెంటర్లు
- వడ్ల కొనుగోలుకు యాక్షన్ ప్లాన్
యాదాద్రి, వెలుగు : వడ్ల కొనుగోలులో కీలకంగా వ్యవహరించే పాక్స్(ప్రాథమిక సహకార పరపతి సంఘం)కు సివిల్సప్లయ్ఆఫీసర్లు షాక్ ఇచ్చారు. 'పాక్స్' సెంటర్ల ఆధ్వర్యంలోని సెంటర్లలో అక్రమాలకు పాల్పడినట్టు తేలడంతో వందకు పైగా సొసైటీలకు కోత పెట్టారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో నడిచే ఐకేపీలకు ప్రాధాన్యం కల్పించారు.
వడ్ల కొనుగోలుపై కసరత్తు పూర్తి..
వానాకాలం వడ్ల కొనుగోలుపై సివిల్‌సప్లయ్ డిపార్ట్మెంట్కసరత్తు పూర్తి చేసింది. కొనుగోలు సెంటర్ల తోపాటు ఏజెన్సీలను ఎంపిక చేశారు. గడిచిన సీజన్ల మాదిరిగానే ఈసారి కూడా దొడ్డు, సన్న రకాలను వేర్వేరుగా కొనుగోలు చేయనున్నారు.
అవసరమైన గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు, తేమ మీటర్లు, ప్యాడీ క్లీనర్లను రెడీ చేసుకుంటున్నారు. అక్టోబర్ నెలాఖరులో సెంటర్లను ప్రారంభించి, నవంబర్‌నుంచి కొనుగోళ్లు స్పీడప్చేయడానికి సిద్ధం చేసుకుంటున్నారు. ఏ ఏ నెలలో ఎంతమేర ధాన్యం కొనుగోలు చేయాలో 'ప్లాన్' రూపొందించి డిసెంబర్లోనే కొనుగోళ్లు కంప్లీట్ చేయాలని నిర్ణయించుకున్నారు.
4.58 లక్షల టన్నుల దిగుబడి..
యాదాద్రి జిల్లాలో ఈసారి 2.6 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. నెలాఖరుకు మరో 3 వేల ఎకరాల్లో సాగు పెరుతుందని అధికారులు భావిస్తున్నారు. మొత్తంగా 4,58,199 టన్నుల వడ్ల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందులో 78 వేల టన్నులు రైతులు సొంతంగా వాడుకుంటారని, 80 వేల టన్నులు మిల్లర్లు, బ్రోకర్లు కొనుగోలు చేస్తారని లెక్కలు వేసుకున్నారు. మొత్తంగా కొనుగోలు సెంటర్లకు 3 లక్షల టన్నుల వడ్లు వస్తాయని, సీఎంఆర్ కోసం 50 మిల్లులకు ఇస్తామని సివిల్‌సప్లయ్ డిపార్ట్మెంట్తన రిపోర్ట్‌లో పేర్కొంది.
'పాక్స్' సెంటర్లలో భారీగా కోత..
జిల్లా వ్యాప్తంగా ఈ వానాకాలం సీజన్లో 325 సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే వడ్ల కొనుగోలులో కీలకంగా వ్యవహరించే 'పాక్స్'ల్లో కొందరు అక్రమాలకు పాల్పడినట్టు తేలడంతో సెంటర్ల కేటాయింపులో సివిల్ సప్లయ్ శాఖ భారీగా కోత విధించింది. గతేడాది 220 పాక్స్‌లకు కొనుగోలు సెంటర్లు ఇవ్వగా, ఈసారి కేవలం 91 పాక్స్‌లకు మాత్రమే కేటాయించింది. ఈ సెంటర్లలో కూడా ఎంప్లాయిస్ మాత్రం ఇన్చార్జిలుగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. మహిళా సంఘాలు నిర్వహించే ఐకేపీలకు 220 సెంటర్లు, ఫార్మర్ ప్రొడక్ట్ ఆర్గనైజేషన్(ఎఫ్‌పీవో)లకు 14 సెంటర్లను కేటాయించారు.
'పాక్స్'లో జరిగిన అక్రమాలు..
యాసంగి వడ్ల కొనుగోళ్లలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పాక్స్) సెంటర్ల నిర్వాహకులు పలు సందర్భాల్లో అక్రమాలకు పాల్పడ్డారు. అయితే రెండు సందర్భాల్లో అక్రమాలు వెలుగు చూశాయి. వడ్లు కొనుగోలు చేయకున్నా.. సంగెం సెంటర్లో 200 క్వింటాళ్ల కొనుగోలు చేసినట్టుగా రికార్డులు సృష్టించిన ముగ్గురు.. రూ. 4.64 లక్షలు తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. విషయం బయట పడడంతో అధికారులు సొమ్ము రికవరీ చేయడంతోపాటు ముగ్గురిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు. 2021 వానాకాలం సీజన్లో తుర్కపల్లి మండలం పల్లెపహాడ్పాక్స్ సెంటర్ ఇన్చార్జి, పాక్స్ మెంబర్ అకౌంట్లలో పలువురు రైతులకు సంబంధించిన సొమ్ము వేర్వేరు సమయాల్లో రూ. 20 లక్షలు జమ చేసుకున్నారు. దీనిపై ఫిర్యాదు రావడంతో విచారణ జరిపి కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని ఆఫీసర్లు రిపోర్ట్ చేశారు.