యాదాద్రి జడ్పీ పీఠంపై ఆశలు ఆవిరి

యాదాద్రి  జడ్పీ పీఠంపై ఆశలు ఆవిరి
  • యాదాద్రి జడ్పీ బీసీ మహిళకు రిజర్వ్​
  • ఎమ్మెల్యేల కుటుంబీకుల ఆశలు నీళ్లు
  • ఆలేరు ఎమ్మెల్యే అన్న పక్కకు.. తెరపైకి ఎమ్మెల్యే వదిన పేరు

యాదాద్రి, వెలుగు:  స్థానిక సంస్థల రిజర్వేషన్లు చాలా మంది ఆశలపై నీళ్లు చల్లాయి. జడ్పీటీసీలుగా గెలిచి.. జడ్పీ పీఠం దక్కించుకోవాలని కొందరు.. ఎంపీటీసీలుగా గెలిచి ఎంపీపీ పీఠంపై కూర్చోవాలని చాలా మంది ఆశించారు. యాదాద్రి జిల్లాలోని ఎమ్మెల్యేల కుటుంబీకులు జడ్పీ పీఠంపై కూర్చోవాలని ఆశించారు. కానీ రిజర్వేషన్లతో  వారి ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. 

యాదాద్రి జడ్పీపై ఆశలు.. గల్లంతు

యాదాద్రి జడ్పీ పీఠంపై కూర్చోవాలని ప్రభుత్వ విప్​, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య సోదరుడు బీర్ల శంకరయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్​ రెడ్డి కూతురు కీర్తి రెడ్డి ఆశపడ్డారు. గత ఏడాదిగా ప్రజల్లో తిరుగుతూ సొంత పాపులారిటీ పెంచుకునే ప్రయత్నాలు చేశారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన బీర్ల శంకరయ్య రాజాపేట లేదా యాదగిరిగుట్ట నుంచి జడ్పీటీసీగా పోటీ చేయాలని భావించారు. అయితే అనూహ్యంగా రాజాపేట జడ్పీటీసీ ఎస్సీ మహిళకు రిజర్వ్​ అయింది. అదే విధంగా యాదగిరిగుట్ట జడ్పీటీసీ జనరల్​​ అయింది. కాగా కుంభం కీర్తి రెడ్డి వలిగొండ నుంచి జడ్పీటీసీగా పోటీ చేసి జెడ్పీ పీఠంపై కూర్చోవాలని ఆశించారు. అయితే వలిగొండ జడ్పీటీసీ బీసీ(జనరల్​) రిజర్వేషన్​ ఖరారైంది. అయితే జనరల్​ రిజర్వ్​డ్​ అయిన బీబీనగర్​, జనరల్​ మహిళ అయిన భువనగిరి నుంచి పోటీ చేసే అవకాశం ఉండేది. జడ్పీ పీఠం బీసీ మహిళకు రిజర్వ్​ అయింది. దీంతో ఈ పీఠంపై ఆశలు పెట్టుకున్న వారిద్దరి ఆశలు గల్లంతయ్యాయి.

ప్రచారంలో అయిలయ్య వదిన పేరు

జడ్పీ చైర్​పర్సన్​ మహిళకు రిజర్వ్​ కావడంతో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్న శంకరయ్య భార్య శివాని పేరు తెరపైకి వచ్చింది. రాజాపేట ఎస్సీ మహిళకు రిజర్వ్​ కావడంతో ఇతరులు పోటీ చేసే అవకాశం లేదు. ఆలేరు నియోజకవర్గంలోని ఇతర మండలాల్లో జడ్పీటీసీగా పోటీ చేసే అవకాశం ఉన్నా.. లోకల్​.. నాన్​లోకల్​ ఫీలింగ్​ వస్తుందని భయపడ్తున్నారు. స్థానిక మండలమైన యాదగిరిగుట్ట జనరల్​ స్థానం కావడంతో ఇక్కడ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య వదిన శివానిని పోటీ చేయిస్తారని  తెలుస్తోంది. 

ఈ స్థానంలో శివానితో పోటీ చేయించి జడ్పీ పీఠంపై కూర్చోబెట్టాలని ఆలోచన చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. జనరల్​ సీటు కావడంతో కొందరు ఇతర సామాజిక వర్గాలకు చెందిన కాంగ్రెస్​ లీడర్లు ఇక్కడి నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కానీ ఎమ్మెల్యే కుటుంబం నుంచి పోటీ చేయడానికి రెడీగా ఉన్నట్టు తెలియడంతో కొంత నారాజ్​ అయినట్టుగా తెలుస్తోంది.