
- యాదగిరిగుట్ట బీజేపీ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్
యాదగిరిగుట్ట, వెలుగు: విదేశాల్లో లక్ష్మీనరసింహస్వామి కల్యాణం పేరుతో ఆలయ అధికారులు గత నాలుగేళ్ల నుంచి భారీగా డబ్బులు దండుకుంటున్నారని యాదగిరిగుట్ట బీజేపీ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్ తీవ్రంగా ఆరోపణలు చేశారు. ఆదివారం యాదగిరిగుట్టలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యాదగిరిగుట్ట ఆలయ ప్రాశస్త్యం విశ్వవ్యాప్తం చేయడం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రభుత్వ అనుమతితో విదేశాల్లో నారసింహుడి కల్యాణాలు జరుపుతున్నామని చెప్తున్న ఆలయ అధికారులు.. అక్కడ స్వామివారి కల్యాణం వల్ల ఆలయానికి వచ్చిన ఆదాయ వివరాలను ఎందుకు బహిర్గతం చేయడం లేదని ప్రశ్నించారు.
గత రెండు నెలల వ్యవధిలోనే రెండు దఫాలుగా విదేశాల్లో కల్యాణాలు జరిపారని, మొదట దఫాలో ఆలయ ఏఈవో గజవెల్లి రఘు ఆధ్వర్యంలో ఒక బృందం వెళ్లి రాగా.. ఆలయ డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్ శర్మ ఆధ్వర్యంలో మరో బృందం ప్రస్తుతం యూకేలో పర్యటిస్తోందన్నారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి దేవస్థానం సహా దేశంలో ఏ ఆలయాలు విదేశాల్లో దేవుళ్ల కల్యాణాలు నిర్వహించడం లేదన్నారు.
కేవలం యాదగిరిగుట్ట దేవస్థాన అధికారులు మాత్రమే తరచూ విదేశాలకు వెళ్లి నారసింహుడి కల్యాణాలు నిర్వహించడంలో ఆంతర్యమేంటని సందేహం వ్యక్తం చేశారు. నారసింహుడి ఉత్సవమూర్తుల విగ్రహాలను సముద్రాలు దాటించి విదేశాలకు తీసుకెళ్లడం ఆగమ శాస్త్రానికి విరుద్ధమని, అయినా కల్యాణాల పేరుతో స్వామివారి విగ్రహాలను విదేశాలకు ఎలా తీసుకెళ్తారని ప్రశ్నించారు. స్వామివారి కల్యాణం పేరుతో ఆలయ అధికారులు, అర్చకులు విదేశాల్లో జల్సాలు చేసిన ఫొటోలు, వీడియోలు బయటికొచ్చాయన్నారు. స్వామివారి విగ్రహాలను కారు సీట్లో సీటు బెల్ట్ పెట్టి తరలించి అపవిత్రం చేశారని మండిపడ్డారు.
నిజంగా యాదగిరిగుట్ట టెంపుల్ గురించి ప్రచారం చేయాలనే చిత్తశుద్ధి ఉంటే.. యాదగిరిగుట్ట గురించి తెలియని పక్క రాష్ట్రాల్లో స్వామివారి కల్యాణాలు నిర్వహించాలని సూచించారు. జల్సాలు చేయడానికి, అక్రమ దారిలో డబ్బులు వెనకేసుకోవడానికే విదేశాల్లో స్వామివారి కల్యాణాలు నిర్వహిస్తున్నారే తప్ప హిందూ ధర్మంపై ప్రేమతో కాదన్నారు. ఏటా స్వామివారి కల్యాణాల పేరుతో విదేశాలకు వెళ్తున్న ఆలయ డీఈవో భాస్కర్ శర్మ, ఏఈవో రఘు బాబు ఆస్తులపై వెంటనే విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి భానుచందర్, కార్యదర్శి సురేష్, సత్యనారాయణ, సీనియర్ నాయకులు అశోక్, మల్లేష్ గౌడ్, నాయకులు రాజిరెడ్డి, నరేష్, బుచ్చిబాబు, లక్ష్మయ్య, శ్రీశైలం, నవీన్ తదితరులు ఉన్నారు.