ఇవాళ నుంచి యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు

ఇవాళ  నుంచి యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి ఈ నెల 21 వరకు నిర్వహించనున్నారు. ఆలయ అధికారులు ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. వేడుకల్లో ముఖ్య ఘట్టాలైన ఎదుర్కోలు 17న, తిరుకల్యాణం 18న, రథోత్సవం 19న నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రుల బృందం హాజరుకానున్నది. ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ.1.60 కోట్ల  బడ్జెట్ కేటాయించింది. ఆలయ చరిత్రలో బ్రహ్మోత్సవాలకు ఇదే అత్యధిక బడ్జెట్ అని చెప్తున్నారు.

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థాన వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. సోమవారం నుంచి ఈ నెల 21 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి ఆలయాధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గుట్టకు వచ్చే మెయిన్​ రోడ్లలో స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని ప్రధానాలయాలకు ప్రత్యేక ఆహ్వానాలు పంపారు. పట్టణంలో ప్రత్యేక లైటింగ్​తో పాటు స్పెషల్ సౌండ్ సిస్టమ్స్ ఏర్పాటు చేశారు. ప్రధానాలయానికి లేజర్ లైటింగ్, యాదగిరికొండకు ప్రత్యేక కరెంట్​దీపాల అలంకరణ చేశారు. రకరకాల పూలతో ఆలయాన్ని చూడముచ్చటగా ముస్తాబు చేశారు.

స్వస్తివాచనంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం

బ్రహ్మోత్సవాలు సోమవారం స్వస్తివాచనంతో మొదలై 21న అష్టోత్తర శతఘటాభిషేకంతో ముగియనున్నాయి. 11 రోజుల పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో నిత్యం నిర్వహించే ఆర్జిత సేవలు, సుదర్శన నారసింహ హోమం, నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణాలు, బ్రహ్మోత్సవ పూజలను రద్దు చేశారు. సోమవారం విష్వక్సేన ఆరాధన, స్వస్తివాచనం, పుణ్యాహవచనం, రక్షాబంధనం, అంకురారోపణంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. 12న ధ్వజారోహణం ద్వారా గరుడ ముద్దలు ఎగరేసి నరసింహుడి కల్యాణానికి సకల దేవతలను ఆహ్వానించనున్నారు. 17న ఎదుర్కోలు, 18న తిరుకల్యాణం, 19న రథోత్సవం నిర్వహించనున్నారు.

13 నుంచి అలంకార సేవలు

ఈ నెల 13 నుంచి ప్రధానాలయ ప్రాంగణంలో వివిధ రకాల అలంకార, వాహన సేవలను నిర్వహించనున్నారు. 13న ఉదయం మత్స్యాలంకార సేవ, రాత్రి శేషవాహన సేవ.. 14న ఉదయం వటపత్రశాయి, రాత్రి హంసవాహన సేవ నిర్వహించనున్నారు. 15న ఉదయం శ్రీకృష్ణ(మురళీకృష్ణుడు) అలంకార సేవ, రాత్రి పొన్నవాహన సేవ..16న ఉదయం గోవర్ధనరిధారి, రాత్రి సింహవాహన సేవ జరపనున్నారు. 17న ఉదయం జగన్మోహిని అలంకార సేవ, రాత్రి అశ్వవాహన సేవ చేపట్టి ఎదుర్కోలు మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. 18న ఉదయం హనుమంత వాహనంపై శ్రీరామ అలంకార సేవ, రాత్రి 8 గంటలకు గజవాహన సేవ చేపట్టి లక్ష్మీనారసింహుల తిరుకల్యాణం జరపనున్నారు. 19న ఉదయం గరుడ వాహనంపై మహావిష్ణువు అలంకార సేవ, రాత్రి 7 గంటలకు దివ్యవిమాన రథోత్సవం.. 20న మహాపూర్ణాహుతి, చక్రతీర్థం, సాయంత్రం పుష్పయాగం, దేవతా ఉద్వాసన నిర్వహించనున్నారు. చివరగా 21న నిర్వహించే అష్టోత్తర శతఘటాభిషేకం, శృంగార డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి కానున్నాయి.

ఆరంభానికి సీఎం రేవంత్, మంత్రులు

సోమవారం ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రుల బృందం హాజరుకానున్నది. సీఎం హోదాలో రేవంత్ తొలిసారిగా గుట్టకు వస్తుండడంతో ఆఫీసర్లు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల నిర్వహణ కోసం రూ.1.60 కోట్ల  బడ్జెట్ కేటాయించారు. ఆలయ చరిత్రలో ఇదే అత్యధిక బ్రహ్మోత్సవాల బడ్జెట్ అని ఆఫీసర్లు చెప్తున్నారు. లైటింగ్ కోసం రూ.60 లక్షలు, మిగతా రూ. కోటి ఉత్సవాల నిర్వహణ కోసం కేటాయించారు.  సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య తదితరులు గర్భగుడిలో స్వయంభూ నారసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు.  

మేం సిద్ధం 

బ్రహ్మోత్సవాలకు సీఎం, మంత్రులు వస్తున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. వీఐపీల రాకతో సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూస్తాం. ఈసారి కల్యాణాన్ని ప్రధానాలయ ఉత్తర ప్రాంగణంలో నిర్వహించనున్నాం. కల్యాణంలో పాల్గొనే భక్తుల కోసం 600 టికెట్లను అందుబాటులో ఉంచాం. ధరను రూ.3 వేలుగా నిర్ణయించి ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో అందుబాటులో పెట్టాం. ఒక టికెట్ పై దంపతులిద్దరికి అవకాశం ఉంటుంది. బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు ప్రతిరోజూ 1600 మంది భక్తులకు అన్నదానం చేయనున్నాం. 
- రామకృష్ణారావు, ఆలయ ఈవో