
యాదగిరిగుట్ట, వెలుగు: మైనర్ల పెళ్లిళ్లకు ఫంక్షన్ హాళ్లను కిరాయికి ఇచ్చినా.. నిబంధనలను ఉల్లంఘించినా వాటిని సీజ్ చేసి నిర్వాహకులపై పోక్సో కేసు పెడతామని యాదగిరిగుట్ట సీఐ భాస్కర్ హెచ్చరించారు. మంగళవారం యాదగిరిగుట్టలో పలు ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులకు పోలీసులు అవేర్‌నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ భాస్కర్ మాట్లాడుతూ.. ఫంక్షన్ హాళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి 30 రోజుల బ్యాకప్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఫంక్షన్ హాళ్లలో మైనర్ వివాహాలు జరిపితే పోక్సో యాక్ట్ కింద చర్యలు తీసుకుంటామన్నారు.
ఫంక్షన్ హాళ్లు కిరాయికి ఇచ్చే ముందు ఆధార్ కార్డు జిరాక్స్, ఫోన్ నంబర్ తీసుకుని రిజిస్టర్‌లో వివరాలు తప్పక ఎంట్రీ చేసి పోలీస్ స్టేషన్‌లో ఎప్పటికప్పుడు వివరాలు అందజేయాలన్నారు. అనుమానితులకు ఎట్టి పరిస్థితుల్లో ఫంక్షన్ హాళ్లు కిరాయికి ఇవ్వొద్దన్నారు. ఫంక్షన్ హాళ్లలో ఎవరైనా సమావేశాలు నిర్వహించుకోవాలంటే పోలీసుల అనుమతి తప్పక తీసుకోవాలన్నారు.
మద్యపానం అనుమతి కోసం ముందస్తుగా ఎక్సైజ్ పోలీసుల నుంచి పర్మిషన్ తీసుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్ఐ యాదయ్య, పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు