ఇల్లు ఖాళీ చేయమని బెదిరిస్తున్నారు

ఇల్లు ఖాళీ చేయమని బెదిరిస్తున్నారు

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్టలో 40 ఏండ్లుగా నివాసం ఉంటున్న తమ ఇల్లును ఖాళీ చేయాలని కొందరు వ్యక్తులు పోలీసులతో బెదిరిస్తున్నారని బాధితులు అగర్వాల్ హనుమంతు, గణేశ్, సత్యనారాయణ, చందూలాల్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం యాదగిరిగుట్టలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి బాధితులు తమ గోడును వెల్లబోసుకున్నారు. బతుకుదెరువు కోసం పక్క రాష్ట్రం నుంచి యాదగిరిగుట్టకు వచ్చిన అగర్వాల్ శంకర్ లాల్ మార్వాడీ.. కుటుంబంతో కలిసి ఓ ఇల్లును అద్దెకు తీసుకున్నారు. 2004లో తాను అద్దెకు ఉంటున్న ఇల్లును ఇంటిని గోర్ల నర్సయ్య నుంచి అగర్వాల్ శంకర్ లాల్ రూ.1.10 లక్షలకు కొనుగోలు చేసి పెద్దల సమక్షంలో సాదాబైనామా కూడా రాయించుకున్నారు. ఇల్లును తనపేరుపై రిజిస్ట్రేషన్ చేయాలని కోరగా.. 15 ఏండ్ల నుంచి రేపు, మాపు అంటూ దాటవేశారు. 

కాలక్రమంలో ఇల్లు అమ్మిన గోర్ల నర్సయ్య, ఇల్లు కొనుగోలు చేసిన అగర్వాల్ శంకర్ లాల్​ ఇద్దరూ చనిపోయారు. శంకర్ లాల్ కుమారులైన అగర్వాల్ హనుమంతు, గణేశ్, సత్యనారాయణ, చందూలాల్ వారి భార్యాపిల్లలతో కలిసి అదే ఇంట్లో ఉంటున్నారు. 40 ఏండ్ల నుంచి ప్రభుత్వానికి ఇంటి పన్ను, కరెంటు బిల్లు చెల్లిస్తున్నారు. ఇంటికి సంబంధించిన డబ్బులు చనిపోయిన తమ తండ్రిగారైన అగర్వాల్ శంకర్ లాల్ ఇప్పటికే చెల్లించినందున తమకు రిజిస్ట్రేషన్ చేయాలని గోర్ల నర్సయ్య వారసులను సదరు మార్వాడీ కుమారులు కోరగా.. ఇల్లు తమదేనని, తాము ఇల్లు ఎవరికీ అమ్మలేదని బుకాయిస్తూ ఇల్లు ఖాళీ చేయాలని పోలీసులతో బెదిరిస్తున్నారని ఆరోపించారు. దాదాపుగా 21 ఏళ్ల క్రితం ఇంటిని రూ.1.10 లక్షలకు కొనుగోలు చేసి నివాసం ఉంటూ వస్తున్నామని, ఇప్పుడు గోర్ల నర్సయ్య వారసులు ఇల్లు తమదని ఖాళీ చేయమంటే ఎలా చేస్తామని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, ఎమ్మెల్యే తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. లేకపోతే ఆత్మహత్యే శరణ్యమని బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు.