యాదగిరిగుట్ట లో 'కార్తీక' సందడి

యాదగిరిగుట్ట లో 'కార్తీక' సందడి
  •  సత్యనారాయణస్వామి వ్రతాలు, కార్తీక దీపారాధనలో భారీగా పాల్గొన్న భక్తులు
  •  ఆదివారం ఒక్కరోజే వ్రతాలు జరిపించుకున్న 713 మంది దంపతులు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఆదివారం కార్తీక పూజలు నిర్వహించుకునే భక్తులతో సందడిగా మారింది. సండే హాలీడే కావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చి కార్తీక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. సత్యనారాయణస్వామి వ్రతాలు, కార్తీక దీపాలు వెలిగించి తరలించారు.

 అదేవిధంగా యాదగిరిగుట్ట అనుబంధ ఆలయమైన పర్వతవర్దినీ సమేత రామలింగేశ్వరస్వామి (శివాలయం) క్షేత్రంలో భక్తులు శివకేశవులకు అభిషేకం, బిల్వార్చన పూజలు నిర్వహించుకున్నారు.  కార్తీక పూజలు జరిపించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో..  వ్రత మండపాలు, కార్తీక దీపారాధన ప్రదేశాలు కిక్కిరిశాయి. సత్యదేవుడికి వ్రతాలు నిర్వహించుకోవడానికి వచ్చిన భక్తులతో వ్రత మండపాలు.. కార్తీక దీపాలు వెలిగించే భక్తులతో మండపాలు సందడిగా మారాయి.

 ఉదయం 6 నుంచి సాయంత్రం 4 గంటల వరకు.. ఆరు బ్యాచులలో నిర్వహించిన వ్రత పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం ఒక్కరోజే 713 మంది దంపతులు సత్యనారాయణస్వామి వ్రతాలు జరిపించుకున్నారు. తద్వారా వ్రతాల ద్వారా రూ.7.13 లక్షల ఆదాయం వచ్చింది. ఇక భక్తులు జరిపించిన అన్ని రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆదివారం ఆలయానికి రూ.52,37,284 ఇన్ కమ్ సమకూరినట్లు ఆలయ ఆఫీసర్లు వెల్లడించారు.