- ఒక్క కొబ్బరికాయ రూ.40 మాత్రమే అని స్టిక్కర్లు ఏర్పాటు
 
యాదగిరిగుట్ట, వెలుగు: పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో వ్యాపారులు కొబ్బరికాయల రేట్లు ఇష్టానుసారంగా పెంచి ఒక్కో భక్తులకు ఒక్కో కొబ్బరికాయను రూ.100 కు విక్రయిస్తుండడంతో.. సోమవారం 'వెలుగు' దినపత్రికలో ప్రచురితమైన 'కొండపైన కొబ్బరికాయ రూ.100' కథనంతో పాటు పలు పత్రికల్లో పబ్లిష్ అయిన వార్తా కథనాలకు ఆలయ అధికారులు స్పందించారు. కొబ్బరికాయల వ్యాపారులకు నోటీసులు జారీ చేయడంతో పాటు.. కొండపైన కొబ్బరికాయల దుకాణాల వద్ద 'ఒక్క కొబ్బరికాయ రూ.40 మాత్రమే' అని పోస్టర్లు, స్టిక్కర్లు అంటించారు.
ఆలయ ఇంఛార్జ్ డిప్యూటీ ఈవో జూషెట్టి కృష్ణ గౌడ్ స్వయంగా కొబ్బరికాయల దుకాణాలను సందర్శించి ఆలయ సిబ్బందితో పోస్టర్లు, స్టిక్కర్లు ఏర్పాటు చేపించారు. టెండర్ నిబంధనల ప్రకారం కొబ్బరికాయ ధర రూ.40 మాత్రమేనని, ఎవరైనా రూల్ ను బ్రేక్ చేస్తే షాప్ టెండర్ ను రద్దు చేస్తామని హెచ్చరించారు. కొబ్బరికాయలు అధిక రేట్లకు విక్రయిస్తున్నారని భక్తుల నుండి మళ్ళీ ఫిర్యాదులు వస్తే ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా నేరుగా దుకాణాల టెండర్ ను రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఇంఛార్జ్ డిప్యూటీ ఈవో జూషెట్టి కృష్ణ గౌడ్, ఏఈవోలు నవీన్, మహేష్, ఆలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.
