
ఆగ్రాలో యమునా నది ఉప్పొంగడంతో ఐకానిక్ మొఘల్ స్మారక చిహ్నం-తాజ్ మహల్ వరద ముప్పును ఎదుర్కొంటోంది. దేశ రాజధానిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు జాతీయ వారసత్వానికి సమీపంలో నది నీటి మట్టం పెరిగేందుకు కారణమయ్యాయి. తాజాగా నది నీరు తాజ్ మహల్ సరిహద్దు గోడను తాకడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది.
తాజ్‌మహల్ సరిహద్దుకు సమీపంలో ఉన్న దసరా ఘాట్‌లో వరదలు పోటెత్తినట్లు తాజ్‌మహల్ కు చెందిన కొన్ని దృశ్యాలు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి. యమునా నదిలో నీటిమట్టం నిరంతరం పెరగడం వల్ల తాజ్ మహల్‌కు వరద ముప్పు ఏర్పడింది. వరదలను నివారించడానికి సికంద్రాలోని కైలాష్ ఆలయం నుంచి తాజ్ మహల్ సమీపంలోని దసరా ఘాట్ వరకు నది ఘాట్‌లపై అధికారులు బారికేడ్లను ఏర్పాటు చేశారు.
యమునాలో నీటి మట్టం ఆగ్రాలో 495.8 అడుగులకు చేరుకోవడంతో అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేశారు. ఆ తర్వాత వరద కాస్త తగ్గినా.. అది సమీపంలోని రోడ్లు, తాజ్‌గంజ్‌లోని శ్మశానవాటికను ముంచెత్తింది, ఇత్మద్-ఉద్-దౌలా స్మారక చిహ్నం గోడను తాకింది.