నవంబర్ ముగుస్తున్నా ఖరారు కాని యాసంగి యాక్షన్ ప్లాన్

నవంబర్ ముగుస్తున్నా ఖరారు కాని యాసంగి యాక్షన్ ప్లాన్
  • ప్రాజెక్టుల నిండా నీళ్లున్నా సాగును కుదించాలని సర్కారు ఎత్తుగడ
  • గత యాసంగితో పోలిస్తే సగానికి తగ్గించాలని సూచనలు!
  • 10 లక్షల ఎకరాల్లోపే వరిని పరిమితం చేసేలా చర్యలు
  • ఆరుతడి పంటలకే నీళ్లిచ్చేలా ప్రపోజల్స్ ఇవ్వాలని ఇంజనీర్లకు ఆదేశం
  • ప్రాజెక్టుల కింద 20 లక్షల ఎకరాల్లో వరి సాగుపై సందిగ్ధత
  • అందుబాటులో 300 టీఎంసీలు.. అయినా రైతులకు ఎదురుచూపులు

హైదరాబాద్‌‌, వెలుగు: ప్రాజెక్టుల కింద వరి సాగును  భారీగా తగ్గించి, ఎక్కువగా ఆరు తడి పంటలకే నీళ్లు ఇవ్వాలని రాష్ట్ర సర్కారు భావిస్తోంది. యాసంగిలో ప్రాజెక్టుల కింద వరిసాగును వీలైనంత కుదించి  ప్రతిపాదనలు ఇవ్వాలని చీఫ్‌‌ ఇంజనీర్లకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. నిరుడు యాసంగిలో నవంబర్‌‌ రెండో వారంలోనే యాక్షన్‌‌ ప్లాన్‌‌ ఖరారు కాగా.. ఇప్పుడు డిసెంబర్‌‌ రెండో వారం దాకా స్పష్టత వచ్చే అవకాశం కనిపించడం లేదు. వరి సాగుపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇస్తే తప్ప ప్రాజెక్టుల నుంచి నీళ్లు ఇవ్వడం కష్టమేనని తెలుస్తోంది. దీంతో 20 లక్షలకు పైగా ఎకరాల్లో వరి, మరో 20 లక్షల ఎకరాల్లో ఆరుతడి పంటల సాగుపై ఎఫెక్ట్ పడింది. ప్రాజెక్టుల్లో నీళ్లు ఫుల్లుగా ఉన్నా.. రైతులు ఎదురు చూడాల్సిన పరిస్థితి.

నిండుకుండల్లా ప్రాజెక్టులు
ఈ ఏడాది వర్షాలు మస్తుగా కురిశాయి. వానాకాలం సాగు అవసరాలకు నీళ్లు ఇచ్చినా.. నాగార్జునసాగర్‌‌, శ్రీరాంసాగర్‌‌ సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటి మట్టంతో కళకళలాడుతున్నాయి. అన్నింటిలో కలిపి కనీస మట్టానికి పైన 300 టీఎంసీల వరకు నీళ్లు అందుబాటులో ఉన్నాయి. ఎస్సారెస్పీకి ఈ ఏడాది రికార్డు స్థాయిలో 678 టీఎంసీలకు పైగా వరద వచ్చింది. జూరాలకు 868 టీఎంసీలు, నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌కు 777 టీఎంసీలు, గోదావరి బేసిన్‌‌‌‌‌‌‌‌లోని నిజాంసాగర్‌‌‌‌‌‌‌‌, సింగూరు, ఎల్‌‌‌‌‌‌‌‌ఎండీలకు వంద టీఎంసీలకు పైగా వరద వచ్చింది. నిరుడు యాసంగిలో ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీళ్లిచ్చే యాక్షన్‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌ నవంబర్‌‌‌‌‌‌‌‌ రెండో వారంలో ఖరారు చేశారు. 289 టీఎంసీలతో 33,13,431 ఎకరాలకు నీళ్లు ఇచ్చేలా ప్లాన్ ఖరారు చేశారు. ఇందులో వరి సాగు 18.37 లక్షల ఎకరాలు కాగా, ఆరుతడి పంటలు 14.75 లక్షలుగా నిర్ణయించారు. ఇవిపోను చెరువులు, ఐడీసీ లిఫ్టుల కింద ఇంకో మూడు లక్షల ఎకరాలకు పైగా వరి ఆయకట్టుకు నీళ్లు ఇచ్చేలా ప్రతిపాదనలు చేశారు.

ఎటూ తేల్చని సర్కారు
యాసంగిలో ఏయే పంటలు సాగు చేయాలో ప్రభుత్వం ఇంతవరకు తేల్చలేదు. దీంతో యాసంగి సాగు మరింత ఆలస్యమయ్యే పరిస్థితి నెలకొంది. ప్రాజెక్టుల్లోని నీటి నిల్వలు, యాసంగి సాగుకు నీటి విడుదలపై చర్చించేందుకు మూడు రోజుల క్రితం చీఫ్‌‌‌‌‌‌‌‌ ఇంజనీర్లతో ఈఎన్సీ సమావేశమయ్యారు. యాసంగి యాక్షన్‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌పై ప్రతిపాదనలు ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశానికి హాజరైన చీఫ్‌‌‌‌‌‌‌‌ ఇంజనీర్లు.. గత యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌లో మాదిరిగానే ఎక్కువ మొత్తంలో వరిసాగుకు నీళ్లిచ్చేలా ప్రతిపాదనలు సమర్పించారు. ఈసారి యాసంగిలో వరి పంటకు ఎక్కువ నీళ్లు ఇచ్చే అవకాశం లేదని, ఆరుతడి పంటలకే నీళ్లు ఇచ్చే ప్రతిపాదనలు మార్చి ఇవ్వాలని ఈఎన్సీ ఆదేశించినట్టు తెలిసింది. ఒక ప్రాజెక్టు కింద 45 టీఎంసీల నీటిని ఇచ్చేలా ప్రపోజల్‌‌‌‌‌‌‌‌ ఇవ్వగా.. దాన్ని సగానికి కన్నా ఎక్కువ తగ్గించి మళ్లీ ఇవ్వాలని సూచించినట్టు సమాచారం. దీంతో ఆయా ప్రపోజల్స్‌‌‌‌‌‌‌‌లో మార్పులు చేసి ఇచ్చేందుకు కనీసం వారం రోజుల సమయం పడుతుందని తెలుస్తోంది. డిసెంబర్‌‌‌‌‌‌‌‌ రెండో వారంలోనే ప్రాజెక్టుల కింద ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇస్తారనే దానిపై స్పష్టత వచ్చే అవకాశముంది. ప్రాజెక్టుల కింద 40 లక్షల ఎకరాలు సాగు చేసేందుకు అవకాశం ఉండగా, 10 లక్షల ఎకరాల్లోపే వరి, మిగతా 30 లక్షల ఎకరాల్లో ఆరుతడి పంటలు వేయించాలని సర్కారు భావిస్తున్నట్లు సమాచారం.


కాళేశ్వరం మోటార్లు మళ్లా బంద్​!
అన్ని రిజర్వాయర్లు నిండుగా ఉండడం, ఆ నీళ్లనే వాడుకునే పరిస్థితి లేక పోవడంతో యాసంగిలో కాళేశ్వరం మోటార్లు నడిపే అవసరం రాకపోవచ్చని ఆఫీసర్లు చెప్తున్నారు. వానాకాలంలో మేడిగడ్డ నుంచి ఎత్తిపోసిన 35 టీఎంసీ ల నీళ్లను ఎగువ నుంచి వరద రావడంతో గేట్లు ఎత్తి నదిలోకి వదిలేశారు. శుక్రవారం నాటికి సుందిళ్లలో 7.24, అన్నారంలో 9.23, మేడిగడ్డ బ్యారేజీలో 13.09 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. మిడ్‌‌ మానేరుకు ఎగువన అనంతగిరిలో 3.03, రంగనాయక సాగర్‌‌లో 2.7, మల్లన్న సాగర్‌‌లో 10.64, కొండపోచమ్మ సాగర్‌‌లో 6.94 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. వీటి కింద పంట కాల్వలు సిద్ధం కాకపోవ డంతో ఈ నీళ్లను పూర్తి స్థాయిలో వాడుకునే అవకాశం లేకపోయింది.


రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో శనివారం నాటికి అందుబాటులో ఉన్న నీటి నిల్వలు
ప్రాజెక్టు    పూర్తి స్థాయి    ప్రస్తుత నిల్వ
    కెపాసిటీ    (టీఎంసీల్లో)
    (టీఎంసీల్లో)
సింగూరు    29.91    29.67
నిజాంసాగర్‌‌‌‌‌‌‌‌    17.8    17.8
ఎస్పారెస్పీ    90.31    90.31
కడెం    7.6    7.17
ఎల్లంపల్లి    20.18    20.18
మిడ్‌‌‌‌‌‌‌‌ మానేరు    27.5    25.12
ఎల్‌‌‌‌‌‌‌‌ఎండీ    24.07    22.66
జూరాల    9.66    9.36
శ్రీశైలం    215.81    131.55
నాగార్జున సాగర్‌‌‌‌‌‌‌‌    312.05    309.06