సాగునీళ్లు అందక పంటలు ఎండుతున్నయ్​

సాగునీళ్లు అందక పంటలు ఎండుతున్నయ్​

వెలుగు, నెట్​వర్క్: ప్రాజెక్టుల కింద సాగునీరందక రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల ఎకరాల్లో యాసంగి  పంటలు ఎండిపోతున్నాయి. వారబందీ పద్ధతిలో నీటిని విడుదల చేస్తున్నా కాలువలు సరిగ్గా లేక ఎక్కడా  సగం ఆయకట్టుకు సైతం నీరు అందుతలేదు.  ప్రాజెక్టుల్లో  నీళ్లున్నప్పటికీ అధికారుల ప్రణాళికా లోపం, ఏండ్ల తరబడి మెయింటెనెన్స్ లేక​ డిస్ట్రిబ్యూటరీలు ​దెబ్బతిన్నాయి. చిన్నాచితక లిఫ్టులకు రిపేర్లు చేయకపోవడంతో కాలువల్లో నీరు పారడం లేదు.  ఎస్సారెస్పీ, సాగర్​, దేవాదుల లాంటి ప్రాజెక్టుల కింద కూడా ఇదే పరిస్థితి ఉంది. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 53.08 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగుచేయగా, అందులో అత్యధిక పొలాలకు కెనాల్​ నీళ్లే ఆధారం. దీనికితోడు కరెంట్​కోతల వల్ల బోర్లు, బావుల కింద కూడా పూర్తిస్థాయిలో నీళ్లు పారించుకోలేని పరిస్థితి నెలకొంది. ఫలితంగా రాష్ట్రంలోని లక్షలాది ఎకరాల్లో వరి, మక్కలాంటి పంటలు ఎండిపోతుండడంతో రైతులు పశువులను మేపుతున్నారు. 

సాగర్​ కింద.. 

సాగర్​లెఫ్ట్​ కెనాల్​ కింద వారబందీ అమలుచేస్తుండడంతో ఆయకట్టు చివరి భూములకు నీళ్లందక నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోని వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. నల్గొండ జిల్లాలో కల్లూరు, బోనకల్, ఊట్కూరు మేజర్ కాల్వలకు నీరందడం లేదు. అనేక చోట్ల డ్రాఫ్టులు ధ్వంసమైనప్పటికీ రిపేర్లు చేయకపోవడం వల్లే రైతుల పొలాలు ఎండే పరిస్థితి వచ్చింది. బోనకల్​ బ్రాంచ్​ కెనాల్ కు 1,300 క్యూసెక్యుల నీటిని విడుదల చేయాల్సి ఉండగా.. సగాని కన్నా తక్కువ నీటిని వదులుతున్నారు. దీంతో వరి పొలాలు నెర్రెలు బారుతున్నాయి.  మక్క  కంకులు పాలు పోసుకునే దశలో ఎండుతున్నాయి. ఖమ్మం జిల్లాలో సాగర్​ కాల్వల కింద రెండున్నర లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కానీ కాల్వలు సరిగా లేకపోవడం, మేజర్, బ్రాంచ్​ కెనాల్స్​కు  నీళ్లందించే రెగ్యులేటరీలు దెబ్బతినడం, వార బందీ అమలు చేస్తుండడంతో బోనకల్, కొణిజర్ల, ఎర్రుపాలెం మండలాల్లో  మేజర్​, బ్రాంచ్​ కెనాల్ ల కింద  దాదాపు 22 వేల ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పెదవాగు ప్రాజెక్టు రెండు గేట్లు పూర్తిగా దెబ్బతిని వాటర్ లీకేజీ సమస్య ఏర్పడటంతో ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరింది. దీంతో 16 వేల ఎకరాలు బీళ్లుగా మారాయి. 

దేవాదుల కింద.. 

దేవాదుల కింద  సాగునీరందక జనగామ జిల్లాలో 20 వేల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. దేవాదుల నీటిని ఎత్తిపోసి జిల్లాలోని 965 మేజర్, మైనర్​ చెరువులను నింపి నీళ్లిస్తామని సర్కారు చెప్పడంతో రైతులు 1.89లక్షల ఎకరాల్లో వరి సాగుచేశారు.  కానీ ఇప్పటివరకు ఒక్క చెరువు కూడా నింపకపోవడంతో  బోరు బావులు ఎత్తిపోయి పొలాలు ఎండుతున్నాయి. దేవాదుల నుంచి ధర్మసాగర్,  ధర్మసాగర్​ నుంచి గండి రామవరం మధ్య  గత వానాకాలంలో పైప్​ లైన్​దెబ్బతినగా ఇంతవరకు రిపేర్లు పూర్తి చేయలేదు. దీంతో జిల్లాలోని గండి రామవరం, ఆర్​ఎస్ ఘన్​పూర్, బొమ్మకూరు, అశ్వరావు పల్లి, నవాబుపేట, చిటకోడూరు లాంటి మేజర్  రిజర్వాయర్లు కూడా వెలవెలబోతున్నాయి. ఫలితంగా జనగామ మండలం వడ్లకొండ, గానుగుపహాడ్​, వెంకిర్యాల, ఎర్రగొల్లపాడు, అడవి కేశవాపూర్​, మరిగడి, నర్మెట, తరిగొప్పుల మండలాల్లోని బొమ్మకూరు, హన్మంతాపూర్​, మల్కపేట, వెల్దండ, కన్నబోయినగూడెం, అమ్మాపురం, నర్మెట, పాలకుర్తి మండలం సిరిసన్నగూడెం, వావిలాల, బీక్యానాయక్​ తండా, మల్లంపల్లి, దర్దేపల్లి స్టేషన్​ ఘన్​పూర్​ మండలం  తానేదార్​ పల్లి, విశ్వనాథపురం, నమిలిగొండ, ఇప్పగూడెం, సముద్రాల, అక్కపెల్లి గూడెం, చంద్రుతండా, కొత్తపల్లి, తాటికొండ, కొడకండ్ల మండలం ఏడునూతుల, రేగుల తదితర ప్రాంతాల్లో వరి పొలాలు నెర్రెలుబారాయి.  

ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి పరిధిలో..

కరీంనగర్ జిల్లాలో  సాగునీరు అందక ప్రాజెక్టుల కింద  పొలాలు బీళ్లుగా మారుతున్నాయి. ఎల్లంపల్లి నుంచి నారాయణపూర్ రిజర్వాయర్ లోకి  నీటిని లిఫ్ట్​ చేయకపోవడంతో  60 వేల  ఎకరాల్లో   పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. ఇక పంట చేతికిరాదని భావించిన పలువురు రైతులు ఆశలు వదిలేసుకోగా.. మరికొందరు  పశువులను  మేపుకుంటున్నారు.   జగిత్యాల జిల్లా మల్యాల, కథలాపూర్, కొడిమ్యాల మండలాల్లో రాళ్ల ప్రాజెక్టు, పోతారం రిజర్వాయర్ కింద పంట పొలాలు ఎండిపోతున్నాయి. నిర్మల్ జిల్లా నర్సాపూర్ జి మండలంలోని లిఫ్ట్ ఇరిగేషన్ చెడిపోయినా రిపేర్లు చేయకపోవడంతో కుంటాల మండలంలోని కల్లూరు, అందకూరు, వెన్కూర్, అర్లి  గ్రామాల్లో పంటలు ఎండిపోతున్నట్లు రైతులు వాపోతున్నారు. కల్వకుర్తి లిఫ్ట్ కింద కెనాల్స్ కు రిపేర్లు చేయలే 
మహబూబ్​నగర్ జిల్లా కోయిల్​సాగర్ ప్రాజెక్టు కింద 55 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా, ప్రస్తుతం వారబందీ ప్రకారం ప్రతి పది రోజులకోసారి నీటిని వదులుతున్నారు. రైట్ కెనాల్ కింద ఉన్న మరికల్, లెఫ్ట్ కెనాల్ కింద ఉన్న పర్దిపూర్, దమగ్నాపూర్, వడ్డేమాన్, చిన్నవడ్డేమాన్, ఏదులాపూర్ గ్రామాల పరిధిలో దాదాపు 3వేల ఎకరాలకు నీరు రావడం లేదు. ప్రస్తుతం ఈ గ్రామాల్లో కొందరు రైతులు పొలాలను పడావుగా వదిలేశారు. కల్వకుర్తి లిఫ్ట్ కింద మెయిన్, సబ్ కెనాల్స్ రిపేర్ చేయక దాదాపు 3 ఏండ్లు దాటింది. కొల్లాపూర్ నియోజకవర్గంలోని కోడేరు, పెద్ద కొత్తపల్లి మండలాల్లోని వందలాది ఎకరాలకు సాగు నీరు అందడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ కు వార బందీ ద్వారా నీటిని సరఫరా చేస్తామని చెప్పడంతో రైతులు పంటలు వేసుకున్నారు. తీరా చివరి ఆయకట్టుకు నీరు అందకపోవటంతో గద్వాల నియోజకవర్గంలోని 10వేల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. 

తుమ్మిళ్ల లిఫ్ట్ బంద్​ పెట్టడంతో..

మంచిర్యాల జిల్లా గూడెం లిఫ్ట్ కింద ఆయకట్టుకు సాగునీళ్లు రాక యాసంగి పంటలు ఎండుతున్నాయి. దండేపల్లి, లక్సెట్టిపేట, హాజీపూర్ మండలాల్లో 30 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా, ఈ యాసంగిలో 20వేలు సాగైంది. లిఫ్ట్ మోటార్లు మొరాయించడం, పైపులు తరచూ పగిలిపోవడం వల్ల నీళ్లు రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే దాదాపు 10 వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. ఉన్న పంటలను కాపాడుకునేందుకు రైతులు బావులు తవ్విస్తున్నారు. మరికొందరు బోర్లు వేయిస్తున్నారు. నీళ్లు వస్తాయని ఎకరానికి రూ.25వేల వరకు నష్టపోయామని, ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం టీ కొత్తగూడెంలో గోదావరి ఒడ్డున నిర్మించిన లిఫ్ట్ ఇరిగేషన్ మోటర్లు దెబ్బతినగా, రిపేర్లు చేయకపోవడంతో సుమారు 1600 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు.  తుంగభద్ర నదిలో నీటిమట్టం తగ్గడం వల్ల గద్వాల జిల్లాలో తుమ్మిళ్ల లిఫ్ట్  బంద్​ పెట్టారు. దీంతో దాదాపు 40వేల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి.

పొట్టదశలో ఎండిపోతున్న వరి

రైతు మాలోతు కరణ్ ది  జనగామ జిల్లా స్టేషన్ ఘన్​పూర్ మండలం చంద్రుతండా.  యాసంగిలో తన నాలుగు ఎకరాల్లో దొడ్డు రకం వరి సాగు చేశాడు. దేవాదుల  నుంచి నీళ్లు రాక  ఊరి చెరువు నింపలేదు. దీంతో  వ్యవసాయ బావులు, బోర్లలో నీళ్లు అడుగంటాయి. దీంతో వారం, పదిరోజులుగా కరణ్ పొలానికి నీళ్లు పారించేందుకు చేస్తున్న ప్రయత్నాలు వృథా అయ్యాయి. ప్రస్తుతం పొట్ట దశలో ఉన్న వరి పంట ఎండిపోతోంది.  ప్రభుత్వం దేవాదుల కాలువల ద్వారా నీళ్లు ఇస్తుందనే ఆశతో వరి సాగు చేశానని, నీళ్లు అందక పంట ఎండుతోందని కరణ్ వాపోయాడు. పెట్టుబడి ఖర్చులు రూ 1.30 లక్షలు మీదపడేటట్లు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు.

పంట ఆగమైంది

వానా కాలంలో ఇబ్బంది లేకుండా పారకం అయిం ది. యాసంగి నాటు వేసేటప్పుడు బావిలో నీళ్లు ఉన్నయ్​. పొలం పారుతది అనుకుని రెండెకరాలు నాటేసినం. మల్లంపల్లి పెద్ద చెరువు కూడా దగ్గరే ఉండటంతో నీళ్లు  ఊరుతయనుకున్నం. కానీ ఊటలు పోయినయ్​. నీళ్లు తగ్గినయ్​. ఎకరం  పొలం కూడా పారుత లేదు. అర్ధ గంటకే నీళ్ళు అడుగంటుతున్నయ్​. 

బానోతు రేణుక,  రైతు, సిరిసన్నగూడెం, పాలకుర్తి


నీళ్లకు గోస పడుతున్నం


నాకు మూడెకరాల పొలం ఉంది. బొమ్మకూరు రిజర్వాయర్​ నీటిపై ఆధారపడి వరి పంట వేస్త. రిజర్వాయర్​ నీళ్లు వస్తయని ఆశ పడితే ఇప్పటి వరకు నీళ్లు ఇస్తలేరు. నీళ్లు లేక వరి పంట దెబ్బతిన్నది. రిజర్వాయర్​లో ఉన్న కొద్ది నీటిని కూడా పంటలకు తీసుకెళ్లాలని రైతులమంతా సొంత ఖర్చులతో తూము వరకు కాల్వ తీస్తున్నం.

- పొతని సత్తయ్య,  రైతు, హన్మంతాపూర్​, నర్మెట మండలం


3 వారాలు సాగర్​ నీళ్లివ్వాలి 

అధికారులు వార బందీ విధానంలో ఒక వారం పాటు నీటిని విడుదల చేసి, మరో వారం నిలుపుదల చేస్తుండడంతో చివరి ఆయకట్టు రైతులకు నీరు సరిపోవడం లేదు. దాదాపు 8 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంట ఎండిపోతోంది.   క్రమం తప్పకుండా మూడు వారాల పాటు సాగర్​ నీళ్లు విడుదల చేసి పంటలను కాపాడాలి.   

- బొంతు రాంబాబు,  జిల్లా కార్యదర్శి, తెలంగాణ రైతు సంఘం