ఇయ్యాల్టీ నుంచి ధాన్యం కొనుగోళ్లు షురూ .. మంచిర్యాల జిల్లాలో ఏర్పాట్లు పూర్తి 

ఇయ్యాల్టీ  నుంచి ధాన్యం కొనుగోళ్లు షురూ .. మంచిర్యాల జిల్లాలో ఏర్పాట్లు పూర్తి 
  • జిల్లా వ్యాప్తంగా 262 సెంటర్లు ఏర్పాటు
  • తరుగు లేకుండా కాంటా వేయాలంటున్న రైతులు
  • నాణ్యత పాటించి మద్దతు ధర పొందాలి: అడిషనల్ కలెక్టర్

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు నేటి నుంచి షురూ కానున్నాయి. ఈసారి మంచిర్యాల నియోజకవర్గంలో డీసీఎంఎస్ సెంటర్లను రద్దు చేశారు. వీటి నిర్వహణలో రాజకీయ నాయకుల జోక్యం కారణంగా గతంలో భారీగా అవినీతి, అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్​సాగర్​ రావు ఆదేశాల మేరకు ఈసారి డీసీఎంఎస్ సెంటర్లను రద్దు చేసినట్టు అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ) మోతీలాల్ తెలిపారు. 

బీఆర్ఎస్ హయాంలో కోతలు 

బీఆర్ఎస్ హయాంలో వచ్చిన తర్వాత ధాన్యం కొనుగోలు సెంటర్లను ఐకేపీతో పాటు  డీసీఎంఎస్, పీఏసీఎస్లకు సైతం కేటాయించారు. వీటిలో చాలావరకు అధికార పార్టీ నాయకులు, వారి బంధువులు, సన్నిహితులకు అప్పగించారు. వీరు రైస్​ మిల్లర్లు, అధికారులతో కుమ్మక్కై రైతులను నాణ్యత పేరుతో బెదిరించి భారీగా తరుగు తీశారు. ఒక్కో క్వింటాళ్​కు 8 నుంచి 10 కేజీల దాకా కట్ చేశారు.

ఇలా గత పదేండ్లలో రూ.600 కోట్లకు పైగా దోచుకున్నారని ఎమ్మెల్యే ప్రేమ్​సాగర్​ రావు ఆరోపించారు. అప్పటి ఎమ్మెల్యే, రైస్​ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్​తో పాటు పలువురు వాటాలు పంచుకున్నారని ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్​మీట్​లో వెల్లడించారు. వచ్చే సీజన్ నుంచి కేవలం ఐకేపీ సెంటర్ల ఆధ్వర్యంలోనే ధాన్యం కొనుగోళ్లు చేపడుతామని, తద్వారా మహిళా సంఘాలు ఆర్థికంగా బలోపేతం అవుతాయని పేర్కొన్నారు. ఇకమీదట తరుగు పేరిట కటింగ్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. 

టోకెన్ ప్రకారం వెళ్లాలి.. రశీదు తీసుకోవాలి 

ప్రభుత్వం మద్దతు ధర ఏ గ్రేడ్​కు రూ.2,203, కామన్ రకానికి రూ.2,183గా ప్రభుత్వం నిర్ణయించింది. తేమ శాతం 17, చెత్త, తాలు ఒక శాతం, మట్టిపెళ్లలు, రాళ్లు ఒక శాతం, చెడిపోయిన, రంగుమారిన, మొలకెత్తిన, పురుగుతిన్న ధాన్యం 5 శాతం, పూర్తిగా తయారుకాని, ముడుచుకుపోయిన ధాన్యం 3శాతం, తక్కువ రకాల మిశ్రమం 6 శాతం ఉండాలి.

రైతులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ధాన్యాన్ని ప్యాడీ క్లీనర్, ఫ్యాన్ల సహాయంతో శుభ్రపర్చి, ఎండ బెట్టి సెంటర్​కు తీసుకెళ్లాలి. శాంపిల్ కోసం కిలో వడ్లు తీసుకొచ్చి ఏఈఓ దగ్గర టోకెన్ పొందాలి. టోకెన్​లో పేర్కొన్న రోజునే సెంటర్​కు వెళ్లాలి. నేరుగా రైస్​ మిల్లులకు తీసుకెళ్లొద్దు. ధాన్యం కాంటా వేసిన తర్వాత రశీదు తీసుకోవాలి. ధాన్యం నాణ్యతను సివిల్ సప్లయీస్ టెక్నికల్ ఆఫీసర్, ఏఈఓలు నిర్ధారణ చేయాలి. మండల వ్యవసాయ అధికారి తన పరిధిలోని సెంటర్లను మానిటరింగ్ చేయాలి. జిల్లా సివిల్ సప్లయిస్ ఆఫీసర్ మిల్లుల కెపాసిటీని బట్టి ధాన్యం కేటాయింపులు చేయాలి. మిగులు ధాన్యాన్ని సమీప జిల్లాలకు పంపించాలి. 

1.74 లక్షల మెట్రిక్ టన్నులు.. 262 సెంటర్లు 

జిల్లాలో ఈ ఏడాది యాసంగి సీజన్​లో లక్షా 988 ఎకరాల్లో వరి సాగు చేయగా, 2లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. రైతుల అవసరాలకు పోగా లక్షా 74 వేల మెట్రిక్ టన్నుల వడ్లు సేకరించాలని టార్గెట్​గా పెట్టుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఐకేపీ 115, పీఏసీఎస్ 119, డీసీఎంఎస్ 28, మొత్తం 262 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో డీసీఎంఎస్ సెంటర్లు రద్దు చేయడంతో పాటు జిల్లాలోనూ వాటి సంఖ్యను తగ్గించారు. ప్రతి సెంటర్​లో ఎలక్ట్రానిక్ వేయింగ్ మెషీన్లు, ప్యాడీ క్లీనర్లు, టార్ఫాలిన్లు, గోనెసంచులు అందుబాటులో ఉన్నాయని అడిషనల్ కలెక్టర్ తెలిపారు. కాగా, జిల్లాలో ఇంకా వరికోతలు ఊపందుకోలేదు. లక్సెట్టిపేట ప్రాంతంలో కోతలు మొదలు కావడంతో ముందుగా అక్కడ సెంటర్లను ఓపెన్ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు.