
యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు జరగనున్న ఆసియా కప్ కు భారత జట్టును మంళవారం (ఆగస్టు 19) బీసీసీఐ ప్రకటించింది. 15 మందితో కూడిన టీమిండియా స్క్వాడ్ కు సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. గిల్ కు వైస్ కెప్టెన్సీ అవకాశం దక్కింది. ఖచ్చితంగా స్క్వాడ్ లో ఉంటారన్న కొంతమంది ప్లేయర్స్ కు సెలక్టర్లు బిగ్ షాక్ ఇచ్చారు. తప్పించడానికి ఎలాంటి కారణం లేకపోయినా స్క్వాడ్ లో స్థానం ఇవ్వలేదు. అదేమంటే వారి బ్యాడ్ లక్ అంటూ సెలక్టర్స్ చేతులెత్తేశారు. ఈ లిస్ట్ లో మొదటి స్థానంలో అందరికీ శ్రేయాస్ అయ్యరే కనిపిస్తాడు. కానీ ఎక్కువ అన్యాయం జరిగింది ఎవరికో ఇప్పుడు చూద్దాం.
ఇండియా స్క్వాడ్ లో ఖచ్చితంగా ఉండడానికి ఓపెనర్ యశస్వి జైశ్వాల్ అర్హుడు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓపెనింగ్ విషయానికి వస్తే అభిషేక్ శర్మ, సంజు శాంసన్, శుభమాన్ గిల్ కంటే జైశ్వాల్ మొదటి వరుసలో ఉంటాడు. 2024 టీ20 వరల్డ్ కప్ కు జైశ్వాల్ బ్యాకప్ ఓపెనర్. అప్పుడు వరల్డ్ కప్ స్క్వాడ్ లో అభిషేక్, గిల్ కూడా లేరు. రోహిత్, కోహ్లీలో ఎవరైనా గాయపడితే జైశ్వాల్ సిద్ధంగా ఉన్నాడు. కానీ 2025 ఆసియా కప్ జైశ్వాల్ కు స్క్వాడ్ లో చోటు లేకపోవడం విచారకరం. ఈ ఏడాది కాలంలో ఏమైనా ఫామ్ కోల్పోయాడా అంటే అది కూడా లేదు. శ్రీలంక, జింబాబ్వే సిరీస్ లో చెలరేగి ఆడాడు.
ఆ తర్వాత టెస్ట్ క్రికెట్ తో బిజీ కావడం వలన జైశ్వాల్ టీ20 క్రికెట్ కు కాస్త బ్రేక్ పడింది. ఐపీఎల్ 2025 సీజన్ లోనూ ఈ టీమిండియా ఓపెనర్ అద్భుతంగా రాణించి 559 పరుగులు చేశాడు. ఇటీవలే ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో 400 పైగా పరుగులు చేసి సత్తా చాటాడు. అవకాశం వచ్చిన ప్రతిసారి తనను తాను నిరూపించుకుంటూనే ఉన్నాడు. కానీ దురదృష్టవశాత్తు జట్టులో ప్లేస్ దక్కలేదు.
జైశ్వాల్ స్క్వాడ్ లో లేకపోవడంపై అగార్కర్ స్పందించాడు.. జట్టులో చోటు దక్కపోవడం యశస్వి జైస్వాల్ బ్యాడ్ లక్ అని.. అభిషేక్ శర్మ బ్యాటింగ్ తో పాటు మాకు ఒక బౌలింగ్ ఆప్షన్ అని చెప్పుకొచ్చాడు.
అంతర్జాతీయ టీ20ల్లో జైశ్వాల్ కు అద్భుతమైన రికార్డ్ ఉంది. సెంచరీతో పాటు 160 కి పైగా స్ట్రైక్ రేట్ ఉంది. 36 యావరేజ్ తో 23 మ్యాచ్ ల్లో 723 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2025 సీజన్ లోనూ 14 మ్యాచ్ ల్లో 559 పరుగులు చేసి సత్తా చాటాడు. గిల్ కు జట్టులో చోటు ఇవ్వడంతో జైశ్వాల్ తప్పించాల్సి వచ్చింది.