Weather Update : చలికాలంలోని ఎండలపై ఎల్లో అలర్ట్

Weather Update : చలికాలంలోని ఎండలపై ఎల్లో అలర్ట్

ఇంకా చలికాలం పూర్తికానేకాలేదు అప్పుడే వాతావరణ శాఖ అలెర్ట్ లు జారీ చేస్తుంది. ఎండ తీవ్రతతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది. ఈ సీజన్‌లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవడంతో కేరళలోని మూడు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గత వారం రోజులుగా, కేరళలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని  కోజికోడ్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్‌ నమోదవ్వగా  కన్నూర్, తిరువనంతపురంలో గరిష్టంగా 36 డిగ్రీలు నమోదయ్యాయని తెలిపింది. 

రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ వడదెబ్బలను నివారించడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ప్రజలను ఇంట్లోనే ఉండమని అవసరమైతే తప్ప బయటకు రాకుడదని హెచ్చరించింది.  ముఖ్యంగా ఉదయం 11 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అలాగే తమను తాము ఎల్లవేళలా హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలని తెలిపింది. పాఠశాలకు వెళ్లే పిల్లలు ఆరుబయట కార్యకలాపాలు తగ్గించుకోవాలని సూచించింది. 

నిర్మాణ, వ్యవసాయ పనులలో నిమగ్నమైన వ్యక్తులతో పాటు వీధి వ్యాపారులకు కూడా సరైన పని గంటలను ఏర్పాటు చేయాలని ఎస్ఎండీఏ తెలిపింది. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ చేసే వారు మధ్యాహ్నం సమయంలో సురక్షితంగా ఉండేలా చూసుకోవాలని సంస్థలను కోరింది. పార్క్ చేసిన వాహనాల్లో పిల్లలను, పెంపుడు జంతువులను వదిలి వెళ్లరాదని హెచ్చరించింది.