గ్యాస్‌ సమస్య వస్తే ...

గ్యాస్‌ సమస్య వస్తే ...

మారుతున్న  లైఫ్‌ స్టైల్‌ వల్ల సరైన తిండి తినకో, కలుషితమైన ఆహారం తినడంవల్లో గ్యాస్ట్రిక్‌ సమస్యలు వస్తున్నాయి. నలుగురిలో ఉన్నప్పుడు గ్యాస్‌ సమస్య వస్తే ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి సమస్యనుంచి బయటపడాలంటే... ప్రతీరోజు ఈ యోగాసనాలు చేయాలి. ఇవి చేస్తే...  గ్యాస్ట్రిక్ ట్రబుల్‌తో పాటు ఎసిడిటీ, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలన్నీ పోయి, జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుందని చెప్తున్నాడు యోగా గురువు సిద్ధ అక్షర్‌‌.

మలాసనం: 

కాళ్లను కొంచెం వెడల్పు చేసి ఇండియన్ టాయిలెట్‌ పోజ్‌లో కూర్చోవాలి. వెన్నెముక నిటారుగా ఉంచాలి. తరువాత రెండు చేతుల్ని మోకాళ్లపై ఉంచి నమస్కరిస్తూ గాలి బాగా పీల్చి, వదులుతూ ఈ ఆసనాన్ని చేయాలి.

పవనముక్తాసనం: 

ఇదెలాచేయాలంటే.. నేలపై వెల్లకిలా పడుకోవాలి. తరువాత రెండు కాళ్లను పైకెత్తి తొడలు పొత్తి కడుపుకి, మోకాళ్లు ఛాతికి తాకేలా మడవాలి. తలను మోకాళ్లకి ఆనిస్తూ, రెండు చేతులతో కాళ్లను గట్టిగా కడుపుకు అదిమి, గాలి పీల్చి, వదలాలి.

దండాసనం: 

కింద కూర్చొని రెండు కాళ్లు చాపి దగ్గరగా పెట్టాలి. నిటారుగా కూర్చొని రెండు అరచేతుల్ని నేలకి ఆన్చి, గాలి పీలుస్తూ, వదలాలి.