భారత క్రికెటర్ రిషబ్ పంత్కు జరిగిన రోడ్డు ప్రమాదంపై క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ స్పందించారు. ఇప్పటికైనా ఇతర క్రికెటర్లు ఒంటరిగా డ్రైవ్ చేయొద్దని సూచించారు. రిషబ్ లాంటి టాప్ క్లాస్ క్రికెటర్లకు డ్రైవర్లను పెట్టుకోవడం పెద్ద భారమేం కాదన్నారు. ‘‘ సెల్ఫ్ డ్రైవ్ చేయాలనే ప్యాషన్ ఉండొచ్చు గాక.. ఈ వయసులో అతడి (పంత్) కి ఇలాంటి ఆలోచన రావడం సహజమే . ఇక ఇదే సమయంలో వ్యక్తిగత సౌకర్యం కోసం డ్రైవర్ ను అపాయింట్ చేసుకోవాలనే నిర్ణయాన్ని తీసుకోవాల్సింది కూడా అతడే (పంత్)’’ అని కపిల్ వ్యాఖ్యానించారు. ఒక జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్కు వెళ్తుండగా..
న్యూఇయర్ వేడుకలకు సర్ ప్రైజ్ ఇద్దామనుకుని హుటాహుటిన బయలుదేరిన రిషబ్ పంత్..కారు ప్రమాదానికి గురయ్యాడు. ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్కు వెళ్తుండగా రూర్కీ వద్ద పంత్ కారు ప్రమాదానికి గురైంది. కారు రోడ్డు పక్కన రెయిలింగ్ను ఢీ కొట్టడంతో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ సమయంలో చాకచక్యంగా వ్యవహరించిన పంత్..కారు అద్దాలు పగులకొట్టుకుని బయటకు దూకి ప్రాణాలను రక్షించుకున్నాడు. అయితే ప్రమాద సమయంలో పంత్ నిద్రపోతూ కారు నడిపినట్లు ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ తెలిపాడు.
నిద్రలోకి జారుకున్నాడు
న్యూఇయర్ వేడుకలకు హాజరై తన తల్లికి సర్ ప్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో పంత్ తెల్లవారుజామునే బయలుదేరాడు. అతివేగంగా కారును నడుపుతున్న పంత్..నిద్రలోకి జారుకున్నాడు. ఉదయం 5 గంటల 15 నిమిషాలకు రూర్కీ వద్ద పంత్ కారు ప్రమాదానికి గురైంది. ఈ సమయంలో రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారులో మంటలు ఎగిసిపడ్డాయి. అయితే వెంటనే తేరుకున్న రిషబ్ పంత్ కారులో నుంచి బయటకు దూకేసి ప్రాణాలు కాపాడుకున్నాడు.