CEIR పోర్టల్తో ఫోన్ను ఈజీగా కనిపెట్టేయొచ్చు..ఎలా పనిచేస్తుందంటే..?

CEIR పోర్టల్తో ఫోన్ను ఈజీగా కనిపెట్టేయొచ్చు..ఎలా పనిచేస్తుందంటే..?

ప్రస్తుతం మనిషి జీవితంలో ఫోన్ ఎంతో విలువైనదిగా మారింది. ఒక గడియ ఫోన్ లేకపోతే ఎంతో ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఫోన్ లేకపోతే రోజు గడవదు అన్న పరిస్థితి ఏర్పడింది. అందుకే ప్రతీ ఒక్కరు తమ ఫోన్ ను ఎంతో అపురూపంగా చూసుకుంటారు. రోజు రోజుకు పెరుగుతున్న టెక్నాలజీలో భాగంగా ఏం చేయాలన్నా ఫోన్ తప్పక ఉండాల్సిందే. అయితే మనం ఎంతో అపురూపంగా..ఇష్టంగా కొనుకున్న ఫోన్ పోతే..ఎంతో బాధపడిపోతాం. ఫోన్ ను ఎవరైనా దొంగిలిస్తే డేటా ఏమైపోతుందో అని భయపడిపోతాం. అయితే ఇకపై మీ ఫోన్ ను ఎవరైనా దొంగిలించినప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు..భయపడాల్సిన అవసరం లేదు. చాలా సులభంగా మీ ఫోన్ ను ఎక్కడుందా తెలుసుకోవచ్చు. 

ఫోన్ ను సులభంగా కనుక్కోవచ్చు. 

CEIR అనే యాప్ ద్వారా మీ ఫోన్ ను ఈజీగా కనిపెట్టేయొచ్చు. ఇదే యాప్ ద్వారా కర్ణాటకలో పోలీసులు 2500 ఫోన్లను కనిపెట్టారు. 2 వారాల్లో బాధితులు పోగొట్టుకున్న 2,500 ఫోన్‌లను వారి తిరిగి ఇచ్చారు. ఈ యాప్ ను ఉపయోగించి దొంగిలించబడిన ఫోన్లను కనిపెట్టడంలో  కర్ణాటక పోలీసులు విజయం సాధించారు. 

ఫోన్ పోతే ఏం చేయాలి..?

ఎవరి ఫోన్ అయినా దొంగిలించబడినా..లేక పోయినా..బాధితులు ముందుగా స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసి ఎఫ్‌ఐఆర్ కాపీ తీసుకోవాలి.  ఆ తరువాత 14422 డాట్ (DoT) నంబర్‌కు ఫోన్ చేసి తమ ఫోన్ పోయిన విషయాన్ని పోలీసులకు కంప్లెయింట్ చేసిన విషయాన్ని చెప్పాలి. వారు వెరిఫై చేసి ఆ ఫోన్‌కు చెందిన IMEI నంబర్ తెలుసుకుని దాని సహాయంతో ఆ ఫోన్‌ను బ్లాక్ లిస్టులో పెడతారు. ఆ వివరాలను టెలికాం ఆపరేటర్లకు ఇస్తారు. దాంతో ఆపరేటర్లు ఆ బ్లాక్‌లిస్టులో ఉన్న IMEI నంబర్ ప్రకారం ఆ ఫోన్‌ను ఎవరైనా వేరే సిమ్‌తో వాడుతుంటే వెంటనే ఫోన్‌ను బ్లాక్ చేస్తారు. అంతేకాదు ఆ సమయంలో ఆ ఫోన్ ఎక్కడ ఉందో దాన్ని ఆపరేటర్లు ట్రాక్ చేసి పోలీసులకు సమాచారం అందిస్తారు. పోలీసులు వెంటనే అలర్ట్ అయి ఫోన్‌ను రికవరీ చేస్తారు.

CEIRలోనూ నమోదు చేయవచ్చు..

మొబైల్ ఫోన్ చోరీకి గురైన వెంటనే CEIR (సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. మొబైల్ ఫోన్‌కు సంబంధించిన వివరాలను..అంటే మొబైల్ నెంబర్, IMEI నెంబర్, ఫోన్ బ్రాండ్, ఫోన్ ఎక్కడైతే పోగొట్టుకున్నారో ఆ ప్రాంతం పేరు, మీ పేరు, అడ్రెస్, ఆధార్ లేదా, ఓటర్ ఐడీ , బిల్ కాపీ, పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు నెంబర్ లాంటివి ఎంటర్ చేసి.. వెబ్‌సైట్‌లో మొబైల్‌ను బ్లాక్ చేయడానికి రిక్వెస్ట్ పెట్టాలి. ఆ ఫోన్ ఎక్కడ ఉందో దాన్ని ఆపరేటర్లు ట్రాక్ చేసి పోలీసులకు సమాచారం అందిస్తారు. పోలీసులు ఫోన్‌ను రికవరీ చేస్తారు.

CEIR సిస్టమ్ ను ముందుగా  ఢిల్లీ, ముంబైలో అమలు చేయడంతో అక్కడ విజయవంతమైంది. ఆ తర్వాత కేంద్ర టెలికం శాఖ  సీఈఐఆర్‌ను కర్ణాటకలో  అమలు చేసిందని ఆ రాష్ట్ర డిజిపి ప్రవీణ్ సూద్ తెలిపారు. ఫిబ్రవరి రెండో వారంలో CEIRను ప్రారంభించామని..రెండు వారాల్లో ఇప్పటి వరకు 2,500 మొబైల్ ఫోన్‌లను కనిపెట్టి వాటి యజమానులకు తిరిగి ఇచ్చామన్నారు. CEIR పోర్టల్‌ గురించి అవగాహన లేని వారు.. సమీపంలోని ఏదైనా పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లి అడగాలని సూచించారు.