ప్రతి నలుగురిలో ఒకరికి..పిల్లలు పుట్టట్లే

ప్రతి నలుగురిలో ఒకరికి..పిల్లలు పుట్టట్లే
  • సంతానలేమి సమస్యతో యువ జంటలు సతమతం 
  • ప్రతి100లో 30 -– 40 జంటలకు ఇన్‌‌ఫర్టిలిటీ ఇష్యూస్ 
  • ఇటీవల సంతాన ప్రసాదం కోసం చిలుకూరుకు పోటెత్తిన జనం 
  • రెండు లక్షల మంది రావడంతో అవాక్కైన ఆలయ పూజారులు 
  • సర్కార్ దవాఖాన్లలో అందుబాటులోలేని ట్రీట్‌మెంట్ 
  • సంతానం లేక డిప్రెషన్‌లోకి లక్షలాది జంటలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో యువతకు పెండ్లి, సంతాన సమస్యలు తలనొప్పిగా మారాయి. పెండ్లిగాక ఎంతో మంది ఇబ్బంది పడుతుంటే.. పెండ్లి అయినంక సంతానం కలగక అంతకంటే ఎక్కువ మందే గోస పడుతున్నారు. రాష్ట్రంలో ప్రతి నాలుగు జంటల్లో ఒక జంట ఏదో ఒక ఇన్‌ఫర్టిలిటీ సమస్యను ఎదుర్కొంటున్నది. ప్రభుత్వ దవాఖాన్లలో ఇన్‌ఫర్టిలిటీకి ట్రీట్‌మెంట్ అందించే సౌలతులు లేకపోవడం, ప్రైవేటు హాస్పిటళ్లలో రూ.లక్షల్లో చార్జీలు వసూలు చేస్తుండడంతో ఆర్థిక స్థోమత లేని ఎంతో మంది మానసికంగా కుంగిపోతున్నారు.

చిలుకూరు బాలాజీ టెంపుల్‌లో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇచ్చే గరుడ ప్రసాదం స్వీకరిస్తే సంతానం కలుగుతుందని అక్కడి పూజారులు చెప్పడంతో.. గత శుక్రవారం ఏకంగా రెండు లక్షల మంది ప్రసాదం కోసం ఆ గుడికి వచ్చారు. దీంతో సుమారు15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. తోపులాటల మధ్యే 30 వేల మంది మహిళలకు పూజారులు ప్రసాదం అందించారు. 

గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో ప్రసాదం కోసం జనాలు రాలేదు. గరుడ ప్రసాదం స్వీకరిస్తే  సంతానంలేని మహిళలకు, సంతాన భాగ్యం కలుగుతుందని ఈసారి పూజారులు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేశారు. దీంతో రాష్ట్రం నలుమూలల నుంచి సంతానలేమితో ఇబ్బంది పడుతున్న మహిళలు గుడికి పోటెత్తారు. అయితే, రాష్ట్రంలో ఉన్న ఇన్‌ఫర్టిలిటీ సమస్యను ఈ ఒక్క ఘటన తేటతెల్లం చేసింది. మళ్లీ ఇదే స్థాయిలో జనాలు వస్తారన్న భయంతో, ఈ నెల 20న జరగాల్సిన ‘‘వివాహ ప్రాప్తిరస్తు’’ పూజకు భక్తులను రావొద్దని ఆలయ పూజారులు పిలుపునిచ్చారు. లేకుంటే, పెండ్లి జరగక ఎంత మంది ఇబ్బంది పడుతున్నరో కూడా తేలిపోయేది. 

సీరియస్​గా తీసుకోని ప్రభుత్వాలు 

మారిన లైఫ్ స్టైల్‌‌తో ఆడ, మగ ఇద్దరిలోనూ ఇన్‌‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ పెరిగాయి. పిల్లలు పుట్టకపోవడంతో కొత్త జంటలు మానసిక వేదనను అనుభవిస్తున్నాయి. కానీ, ఈ సమస్యను ప్రభుత్వాలు సీరియస్‌గా తీసుకోవడం లేదు. ప్రభుత్వ దవాఖాన్లలో ఫర్టిలిటీ సెంటర్లు పెడుతామని 2017లో ప్రకటించిన నాటి బీఆర్‌‌ఎస్ సర్కార్, 2023 వరకూ ఒక్క గాంధీ హాస్పిటల్​లో మాత్రమే ఫర్టిలిటీ సెంటర్‌‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇక్కడ ఐయూఐ, ఐవీఎఫ్ వంటి ఆధునిక చికిత్సలు కూడా అందించాలని నిర్ణయించి, అవసరమైన ఎక్విప్‌మెంట్‌ను కూడా కొనుగోలు చేశారు. నిరుడు అక్టోబర్‌‌లో అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి హరీ శ్‌రావు ఈ సెంటర్‌‌ను హడావుడిగా ప్రారంభించారు. కానీ, ఇప్పటివరకూ అక్కడ ఒక్కరికి కూడా ఐవీఎఫ్‌ చేయలేదు. ఐవీఎఫ్‌ చేయడానికి కావాల్సిన రీఏజెంట్స్‌, మెడిసిన్ఏ వీ అందుబాటులో లేకపోవడం వల్ల తామేమీ చేయలేకపోతున్నామని డాక్టర్లు చెబుతున్నారు. అలాగే, ఐవీఎఫ్‌ సెంటర్ నడపడానికి గైనకాలజిస్ట్​తో పాటు, ఎంబ్రియాలజిస్ట్‌ కూడా అవసరం. వీర్యం, అండం కలెక్ట్ చేసి, వాటిని ట్యూబ్‌లో ఫలదీకరణం చెందించే బాధ్యత అంతా ఎంబ్రియాలజిస్టుదే. కానీ, గాంధీ ఐవీఎఫ్‌ సెంటర్‌‌లో అసలు ఎంబ్రియాలజిస్టునే ఇప్పటివరకూ నియమించలేదు. దీంతో ఎక్విప్‌మెంట్‌ అంతా నిరుపయోగంగా మారింది.

ప్రైవేట్‌‌లో అడ్డగోలు దోపిడీ

ఇన్‌ఫర్టిలిటీ సమస్య డాక్టర్లకు పెద్ద వరంగా మారింది. ‌సమస్య తీవ్రతను ప్రభుత్వాలు తెలుసుకోలేక పోయినా, డాక్టర్లు మాత్రం సమస్యను పసిగట్టి వందల సంఖ్యలో ఫర్టిలిటీ సెంటర్లు ఏర్పాటు చేసి అడ్డగోలు దోపిడీకి తెరతీశారు. ప్రభుత్వ దవాఖాన్లలో అసలు ఫర్టిలిటీ చికిత్స అందుబాటులో లేకపోవడం వీరికి మరింత కలిసొచ్చింది. ఫర్టిలిటీ ట్రీట్‌మెంట్ పేరిట ప్రత్యేక ప్యాకేజీలు పెట్టి మరీ బాధితుల వద్ద రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు. రూ.50  వేల నుంచి 80 వేల మధ్య పూర్తయ్యే ఐవీఎఫ్ చికిత్సకు ఏకంగా రూ.3 లక్షల నుంచి 6 లక్షలు చార్జ్ చేస్తున్నారు. ఈ దోపిడీ ఆరోగ్యశాఖలో కింది స్థాయి నుంచి పైస్థాయి అధికారుల వరకూ తెలిసే జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.