ఎస్సై కాలర్​ పట్టుకున్న యువకుడు చావబాదిన పోలీసులు?

ఎస్సై కాలర్​ పట్టుకున్న యువకుడు చావబాదిన పోలీసులు?
  • ఎస్ఐ కాలర్​ పట్టుకున్న యువకుడు
  • చావబాదిన పోలీసులు?
  • అపస్మారక స్థితిలో హాస్పిటల్​కు..
  • సూర్యాపేట జిల్లా 
  • గరిడేపల్లి పీఎస్​లో  ఘటన
  • పీఎస్, కోదాడ- మిర్యాలగూడ రోడ్డుపై  కుటుంబం రాస్తారోకో  

గరిడేపల్లి, వెలుగు : డ్యూటీలో ఉన్న ఎస్ఐ కాలర్ పట్టుకున్నాడని ఓ యువకుడిని పోలీసులు చితకాబాదారు. ఇప్పుడు అతడు అపస్మారక స్థితిలో దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం ప్రకారం...సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలోని ఖుతుబ్​షాపురానికి చెందిన బాత్కు వలరాజు శుక్రవారం తన అన్న, వదిన గొడవ విషయంలో పోలీస్ స్టేషన్​కు వచ్చాడు. వదిన తమ్ముడు కోడి వీర బాబు, వలరాజు ఘర్షణ పడ్డారు. పోలీసులు ఇద్దరిని అదుపు చేయడానికి ప్రయత్నించారు. ఎస్ఐ వెంకటరెడ్డి వచ్చి ఇద్దరిని స్టేషన్ లోపలికి తీసుకెళ్తుండగా వలరాజు ఎస్ఐ కాలర్ పట్టుకుని నెట్టేశాడు. దీంతో పోలీసులు, ఎస్ఐ కలిసి వలరాజును గదిలోకి తీసుకెళ్లారు. రెండు నిమిషాల్లోనే వలరాజు స్పృహ కోల్పోయాడు. వెంటనే అతడిని పోలీస్ వాహనంలో హుజూర్​నగర్​ ఏరియా హాస్పిటల్​కు తరలించారు. విషయం తెలుసుకున్న వలరాజు బంధువులు, కుటుంబసభ్యులు ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని  రాత్రి పోలీస్​స్టేషన్​, కోదాడ–మిర్యాలగూడ మెయిన్​రోడ్డుపై రాస్తారోకో చేశారు. వలరాజు తండ్రి లింగయ్య మాట్లాడుతూ తన కొడుకు పోలీస్ స్టేషన్ ఆవరణలో మాట్లాడుతుండగా పోలీసులు, ఎస్ఐ వచ్చి బలవంతంగా లోపలికి తీసుకెళ్లి బాగా కొట్టారని చెప్పాడు.  


కూర్చోబెడితే స్పృహ తప్పాడు : ఎస్​ఐ 


పోలీస్ స్టేషన్ ఆవరణలో వలరాజు, కోడి వీరబాబు ఘర్షణ పడుతుండగా వారిద్దరిని ఆపే క్రమంలో వలరాజు తన కాలర్ పట్టుకుని నెట్టి వేశాడని ఎస్ఐ వెంకటరెడ్డి చెప్పారు. దీంతో వారిద్దరిని లోపలికి తీసుకెళ్లి చెరో చోట కూర్చోబెట్టగా వలరాజు స్పృహ తప్పాడన్నారు. వెంటనే హాస్పిటల్​కు తరలించామన్నారు. డ్యూటీలో ఉన్న ఆఫీసర్ ​గల్లా పట్టుకున్నందుకు, నెట్టివేసినందుకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.