యువకుడి ప్రాణం తీసిన ఐపీఎల్ బెట్టింగ్

యువకుడి ప్రాణం తీసిన ఐపీఎల్ బెట్టింగ్

రాష్ట్ర వ్యాప్తంగా ఐపీఎల్ బెట్టింగ్ జోరుగా సాగుతోంది. ఐపీఎల్ ను చూసి క్రికెట్ అభిమానులు పండగ చేసుకుంటుంటే .. మరికొందరు బెట్టింగ్ ఉచ్చులో ఇరుక్కొని అల్లాడుతున్నారు. ఐపీఎల్‌లోక్రికెట్ బెట్టింగ్ ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఐపీఎల్‌ క్రికెట్ బెట్టింగ్ లో పెట్టిన డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో.. యువకుడు ఆత్మహత్య చేసుకోవడం స్థానికలంగా కలకలం రేపింది.

రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలంలోని నార్లగూడ తండాలో అంగోతు ప్రకాశ్ అనే యువకుడు బెట్టింగ్ లో పాల్గొని ఓడిపోయాడు. రాత్రి(మే 17) జరిగిన ఢిల్లీ వర్సెస్ పంజాబ్ క్రికెట్ మ్యాచ్ లో పంజాబ్ గెలుస్తుందని ప్రకాశ్ కొంతమంది మిత్రులతో బెట్టింగ్ వేశాడు. ఈ మ్యాచ్ లో పంజాబ్ ఓడిపోయింది. దీంతో ప్రకాష్ మిత్రులు బెట్టింగ్ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బులు కట్టేని పరిస్థితిలో ఉన్న ప్రకాశ్ ఏం చేయాలో తెలియక.. మానసిక ఒత్తిడికి గురై ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని గ్రామస్థులు తెలిపారు. ప్రకాష్ ఆత్మహత్యను చూసి అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బెట్టింగ్ ఉచ్చులో పడి ఆత్మహత్య చేసుకోవడంపై తండా వాసులను కలచివేసింది.

ప్రకాష్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బెట్టింగ్ ముఠా నుంచి యువకులను రక్షించాలని ప్రకాష్ కుటుంబ సభ్యులు, బంధువులు పోలీసులను కోరారు. బెట్టింగ్ కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.