ఇంకెంత మంది నిరుద్యోగులు బలికావాలె?

ఇంకెంత మంది నిరుద్యోగులు బలికావాలె?

తెలంగాణ వస్తే లక్షల్లో ఉద్యోగాలొస్తాయనుకున్న మన యువత పరిస్థితి.. ఉమ్మడి రాష్ట్రంలో కంటే దయనీయంగా తయారైంది. రాష్ట్ర సాధన కోసం అన్నీ వదులుకుని పోరాడిన యువకులు నేడు మధ్య వయసుకు చేరి, కుటుంబాలను పోషించుకోలేని దుర్భర స్థితిలో జీవితాలు సాగిస్తున్నారు. జాబ్ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసీ చూసీ, అన్నింటికీ ఆగమైపోతున్నారు. ఆత్మాభిమానాన్ని చంపుకోలేక.. పదిమందిలో తల ఎత్తుకొని తిరగలేక జీవచ్ఛవాలుగా మిగిలిపోయారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు ఖాయమనుకున్న యువత.. రాష్ట్రం తెచ్చుకోవడానికి ప్రాణాలు అర్పించారు. రాష్ట్రం ఏర్పడి ఏడేండ్లు గడిచినా ఆ అమరుల ఆకాంక్షలు నెరవేరనేలేదు. రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరుల ఘోష.. వారి కుటుంబాల ఆవేదన.. నిరుద్యోగుల ఎదురు చూపులు.. మళ్లీ యువత ఆత్మబలిదానాలు చేసుకునే పరిస్థితి రావడం.. వీటన్నింటికీ అమరుల త్యాగాల ఫలితాన్ని అనుభవిస్తున్న పాలకులు సమాధానం చెప్పాల్సిందే.

ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష పెరగడానికి కారణమే మన తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాల్లో అన్యాయం జరగడం. తెలంగాణ వస్తే మన భావి తరాలకైనా న్యాయం జరుగుతుందని వందల మంది యువకులు ప్రాణ త్యాగం చేయడానికీ వెనుకాడలేదు. వారి బలిదానాలతో ఏర్పడిన తెలంగాణ తొలి అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఇంటికో ఉ ద్యోగం వస్తదని నమ్మబలికారు. సీఎం కుర్చీ ఎక్కిన తర్వాత ఆయన ఆ ఊసే మర్చిపోయారు.

అసెంబ్లీలోనూ హామీ ఇచ్చి వదిలేసిన్రు

2014 ఎన్నికలయ్యాక జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాల్లోనూ సీఎం కేసీఆర్ ఉద్యోగాలపై ప్రకటన చేశారు.  రాష్ట్రంలో 1 లక్షా 7 వేల ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలున్నాయని, వాటిని వెంటనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఈ మాటనూ గాలికి వదిలేశారు. స్వరాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని పోరాడిన యువత నేడు ఏండ్ల తరబడి నోటిఫికేషన్లు రాకపోవడంతో వయోపరిమితి దాటిపోతుందన్న భయం, కుటుంబానికి భారంగా మారుతున్నామన్న బాధతో మానసికంగా కుంగిపోతున్నారు.

ఖాళీలు మూడు లక్షలు.. భర్తీ చేసింది 35 వేలు

రాష్ట్రం ఏర్పడేటప్పటికి ఖాళీగా ఉన్న పోస్టులు, ఆ తర్వాత ఏటా రిటైర్ అవుతున్న వారితో కలిపి దాదాపు 3 లక్షలకు పైనే ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీ 110 నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేసింది కేవలం 35,724 ఉ ద్యోగాలు మాత్రమే. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది నిరుద్యోగులు టీఎస్పీఎస్సీ పోర్టల్‌‌లో రిజిస్టర్ చేసుకున్నారని మాజీ టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి ప్రకటించారు. రాష్ట్రంలోని వివిధ డిపార్ట్‌‌మెంట్‌‌లలో మొత్తం 1,91,126 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని ఇటీవలే వచ్చిన పీఆర్సీ రిపోర్ట్ పేర్కొంది. టీఎస్పీఎస్సీలో రిజిస్టర్ చేసుకోని వారితో కలిపి తెలంగాణలో మొత్తం 35 లక్షల మంది నిరుద్యోగులుంటారని ఓ అంచనా. ఈ లెక్కలు ప్రభుత్వానికి తెలియనివి కాదు. అయినా సరే రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్కసారి కూడా గ్రూప్–1 నోటిఫికేషన్ ఇవ్వలేదంటే సీఎం కేసీఆర్‌‌‌‌కు నిరుద్యోగ సమస్య మీద ఎంతటి నిర్లక్ష్యం ఉందో అర్థమవుతోంది. 

ఉద్యోగాల భర్తీపై కాకి లెక్కలు

తెలంగాణలో ఇప్పటి వరకు లక్షా 32 వేల 899 ఉద్యోగాలు భర్తీ చేశామని మంత్రులు కాకి లెక్కలు చెప్తున్నారు. తెలంగాణ ఏర్పడే నాటికి ఉన్న ఖాళీలు ఎన్ని? ఇప్పటి వరకు ఎంత మంది రిటైర్ అయ్యారు? ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి? అన్న లెక్కలు కూడా చెబితే బాగుంటుంది. ప్రైవేటు కంపెనీల్లో వచ్చిన ఉద్యోగాలను కూడా కలిపి సర్కారు దొంగ లెక్కలు చెప్పి యువతను మోసగించాలని చూస్తోంది. నిజానికి సర్కార్ భర్తీ చేసిన వాటి కంటే ఖాళీ అయిన ఉద్యోగాలు పదింతలు ఉంటాయి. రాష్ట్రంలో యువతకు తప్ప టీఆర్ఎస్ నేతలు, కల్వకుంట్ల కుటుంబానికి మాత్రమే రాజకీయ నిరుద్యోగం లేకుండా ఎప్పటికప్పుడు పదవులు దక్కించుకుంటున్నారు.

ఓటు బ్యాంకు రాజకీయాలు

రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన లేదు. ఉద్యోగాలు లేనివారికి నిరుద్యోగ భృతి కల్పిస్తామని 2018 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సీఎం కేసీఆర్ ఆ హామీని రెండున్నరేండ్లుగా అమలు చేయలేదు. నిరుద్యోగ యువతకు రూ.3,016 చొప్పున ఇస్తామంటూ 2019–-20 బడ్జెట్‌‌లో రూ.1810 కోట్లు కేటాయించారు. కానీ యువతకు పైసా అందలేదు. ఆ తర్వాత 2020–-21, 2021-–22 బడ్జెట్లలో  నిరుద్యోగ భృతి ప్రస్తావనేలేదు. ఇప్పటి వరకు కేసీఆర్ ప్రభుత్వం ప్రతి నిరుద్యోగికి 70 వేలకు పైగా బాకీ ఉంది.  ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి అంటూ ప్రకటనలతో యువతను ఓటు బ్యాంకు రాజకీయాలకు కేసీఆర్ వాడుకుంటూ బలిచేస్తున్నారు. 

కొత్త జిల్లాలు, డివిజన్లలో ఉద్యోగాలెన్ని..

ఏండ్ల తరబడి ఖాళీలు భర్తీ చేయకపోవడంతో అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ ఉద్యోగులపై పని భారం పెరుగుతోంది.  రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదించిన పాత కేడర్ స్ట్రెంత్ ప్రకారమే ఎడ్యుకేషన్, హెల్త్, పోలీస్, రెవెన్యూ, వెల్ఫేర్ తదితర 32 డిపార్ట్​మెంట్లలో కలిపి 4.57 లక్షల పోస్టులు ఉంటే.. ప్రస్తుతం 3.09 లక్షల మంది మాత్రమే పని చేస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. మరో 1.48 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నప్పటికీ.. ఇప్పుడు కేవలం 50 వేల పోస్టులు భర్తీ చేస్తామని చెబుతోంది. దీనికి టీఆర్ఎస్ సర్కార్ ఎలక్షన్ కోడ్‌‌ను సాకుగా చూపిస్తోంది. ఇన్నేండ్లుగా అధికారంలో ఉండి ఏం చేస్తున్నట్టు? ఇంకా ఆ ఉద్యోగాల భర్తీకి ఎన్నేండ్లు పడుతుందో? ఇవి కాక 10 జిల్లాల తెలంగాణను 33 జిల్లాలు చేశాక కొత్త జిల్లాల్లో ఏర్పడిన ఉద్యోగాలెన్ని? వాటిలో కొత్తగా ఎంత మందిని నియమించారు? ప్రస్తుతం ఉన్న ఖాళీలెన్ని? కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలు, కొత్త గ్రామ పంచాయితీలను ఏర్పాటు చేశామని గొప్పగా చెప్పుకొనే సర్కారు వాటిలో పాలన సక్రమంగా నడవాలంటే ఉద్యోగాలు భర్తీ చేయాలన్న విషయం మర్చిపోయింది.

ఆ బలిదానాలకు అర్థం లేకుండా చేయొద్దు

తెలంగాణలో నిరుద్యోగం రేటు 33.9శాతంగా ఉంది. దేశంలో అత్యధిక నిరుద్యోగిత ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని పీరియాడిక్ లేబర్ ఫోర్స్ నివేదిక స్పష్టంచేస్తున్నది. ఉపాధి కల్పనలో టీఆర్ఎస్ సర్కార్ విఫలమవ్వడంతో డిగ్రీలు, పీజీలు చేసిన యువత కూడా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. తెలంగాణ కోసం1200 మంది యువకులు ఆత్మ బలిదానం చేసుకున్న చరిత్ర కేసీఆర్‌‌‌‌కు గుర్తు లేకపోవడం శోచనీయం. కేసీఆర్ కుటుంబానికి రాజకీయ ఉద్యోగాలు కల్పించడం కోసం వాళ్లంతా ప్రాణ త్యాగాలు చేయలేదని తెలుసుకోవాలి.  వారి బలిదానాలకు అర్థం లేకుండా చేయొద్దని అమరుల కుటుంబాలతో పాటు ఉద్యమంలో కొట్లాడిన ప్రతి ఒక్కరూ, తెలంగాణలోని ప్రతి సామాన్యుడూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. రాష్ట్ర యువతలో అభద్రతా భావాన్ని తొలగిస్తూ మరో నిరుద్యోగి బలి కాకముందే ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ చేపట్టాలి.

నిరుద్యోగులూ ఆత్మహత్యలు చేసుకునే స్థితికి రాష్ట్రం..

రాష్ట్రంలో కేసీఆర్ సర్కారు తీరుతో రైతుల ఆత్మహత్యలకు తోడు నిరుద్యోగులు కూడా బలవన్మరణాలకు పాల్పడే స్థితి రావడం సగటు తెలంగాణ పౌరులను కలచివేస్తోంది. ఏడేండ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్ లేకపోవడంతో యువత అన్యాయమైపోతున్నారని తీవ్ర మనస్తాపంతో కాకతీయ వర్సిటీ విద్యార్థి సునీల్ నాయక్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ‘నేను చేతకాక చావడం లేదు, నా చావుతో నైనా నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి’ అని సెల్ఫీ వీడియోలో చెప్పి, పురుగులమందు తాగాడు. నిమ్స్‌‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచినా.. సునీల్ ఆత్మబలిదానంపై సీఎం కేసీఆర్ కనీసం స్పందించలేదు. అతడి మరణానికి కేసీఆరే బాధ్యత వహించాలి. సునీల్ ఒక్కడే కాదు గతంలోనూ కొంత మంది యువత ఇలా ఆత్మహత్యలకు యత్నించిన ఘటనలపైనా సమాధానం చెప్పాలి.

ఉన్న ఉద్యోగాలూ తీసేసిన్రు

ప్రభుత్వం రిలీజ్ చేసిన అరా కొరా నోటిఫికేషన్లు కూడా వివాదాలమయమే. పైగా కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా, ఉపాధి హామీ, మిషన్ భగీరథ, హార్టికల్చర్ శాఖల్లో 10 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. వీరితో పాటు ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ శాఖ, విద్యాశాఖలో కాంట్రాక్టు, ఔట్ సోర్సుల్లో పనిచేస్తున్న మరో పది వేల మందిని నో వర్క్ నో పే పేరుతో టీఆర్ఎస్ సర్కారు రోడ్డున పడేసింది. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానాలే ఉండవని, అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని కేసీఆర్ హామీలు ఇచ్చారు. ఉద్యోగాల్లో ఉన్న వాళ్లను పీకేయడం తప్ప ఎక్కడా పర్మనెంట్ చేసిన దాఖలాలు లేవు.

- డాక్టర్ కె.లక్ష్మణ్,
బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు