
యాదాద్రి, వెలుగు : అక్రమ సంబంధం అంటగట్టారని మనస్తాపంతో పురుగులమందు తాగి ఓ యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగులో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రామంతాపూర్ కేసీఆర్ నగర్ కు చెందిన బంధబాల సుధాకర్ (39), రామంతాపూర్ లోని గాంధీనగర్ కు చెందిన పాసాల సుష్మిల(35) సమీప బంధువులు. ఇద్దరూ వేర్వేరుగా ప్రేమ వివాహం చేసుకున్నారు.
కాగా వీరిద్దరూ సన్నిహితంగా మెలగడంతో ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందని వారి ఇరు కుటుంబాల్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయంలో నల్గొండ జిల్లా కేతేపల్లి పోలీస్ స్టేషన్ లో సుష్మిలపై ఆమె భర్త ధన్‌రాజ్ కేసు కూడా పెట్టాడు. ఈ పరిణామంతో సుధాకర్, సుష్మిల మనస్తాపానికి గురై ఈనెల 27న బీబీనగర్ మండలం కొండమడుగు శివారులోని రాగల రిసార్ట్స్ లోరూమ్ తీసుకొని ఇక్కడే ఉంటున్నారు. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో బయటకు వెళ్లిన వీరిద్దరూ కారులోనే సెల్ఫీ వీడియో తీసి తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తెలిపారు. అనంతరం మధ్యాహ్నం 3.30కు తిరిగి రిసార్ట్స్‌కు చేరుకొని గదిలోకి వెళ్లిపోయారు.
ఆ తర్వాత ఇద్దరు కలిసి సూసైడ్ చేసుకుంటున్నట్లు సుధాకర్ తన బావ రంజిత్ కు వీడియో కాల్ చేసి చెప్పాడు. కానీ ఎక్కడ నుంచి ఫోన్ చేసినట్లు చెప్పలేదు. దీంతో ఉప్పల్పోలీసులను రంజిత్ ఆశ్రయించాడు. మొబైల్ నెట్వర్క్ ఆధారంగా బీబీనగర్ మండలం కొండమడుగు శివారులోని రాగల రిసార్ట్స్ లో ఉన్నట్టు గుర్తించారు. బీబీనగర్ పోలీసుల సాయంతో రిసార్ట్స్‌కు చేరుకొని వారుంటున్న రూమ్ తలుపులు పగులకొట్టి చూసే సరికి అప్పటికే ఇద్దరు మృతి చెందారు. అక్కడ సుష్మిల రాసిన లెటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను భువనగిరిలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మా మధ్య ఏమీ లేదు : సుష్మిల
సుధాకర్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదు. ఆయన వరుసకు బావ. ఇద్దరం మాట్లాడుకుంటే తన భర్త ధన్రాజ్అక్రమ సంబంధం అంటగట్టి కొట్టాడు. తన స్నేహితురాలు సృజనను బ్రోకర్ అంటూ కామెంట్ చేశాడు. ఇవన్నీ భరించలేను. చచ్చి సాధించేదీ ఏమీ లేదు. కానీ బతికి కూడా నేను సాధించేదీ లేదు. అందుకే మా నాన్న దగ్గరకు వెళ్లిపోతున్నా అంటూ సెల్ఫీ వీడియోలో చెప్పింది.
బాధలు భరించే ఓపిక లేక : సుధాకర్
పెళ్లి చేసుకొని పెద్ద తప్పు చేశాను. ఒక్క రోజు కూడా సుఖంగా ఉన్నది లేదు. ఏమీ చేసినా ఏదో ఒక తప్పు చూపించేదీ. అక్రమ సంబంధం అంటగట్టి గౌరవంగా బతికే తన జీవితాన్ని భార్య ఆగం చేసింది. తలెత్తుకొని తిరగలేని స్థితికి చేర్చారు. సుష్మిలతో మాట్లాడడమే నేను చేసిన తప్పా..? ఇక బతికే ఓపిక లేదు. అమ్మ, అక్క, చెల్లి నన్ను క్షమించండి.