ఐటీ సెక్టార్‌‌ను మెచ్చుకున్న మోడీ

ఐటీ సెక్టార్‌‌ను మెచ్చుకున్న మోడీ

న్యూఢిల్లీ: ఐటీ సెక్టార్ పై ప్రధాని మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. కరోనా టైమ్‌లోనూ ఐటీ రంగం దూసుకెళ్లడం మెచ్చుకోదగిందన్నారు. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ టెక్నాలజీ అండ్ లీడర్‌‌షిప్ (నాస్కామ్) నిర్వహించిన కార్యక్రమంలో మోడీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వల్ల అన్ని రంగాలూ ఆటుపోట్లు ఎదుర్కొంటున్న సమయంలోనూ ఐటీ సెక్టార్ 2 శాతం వృద్ధిని నమోదు చేసిందన్నారు.

మహమ్మారి విజృంభణ సమయంలో ఉద్యోగులు ఇళ్ల వద్ద నుంచి పని చేసేందుకు వీలు కల్పించినందుకు ఐటీ కంపెనీలను మోడీ మెచ్చుకున్నారు. ‘ఇప్పుడు ప్రపంచం మొత్తం భారత్ వైపే చూస్తోంది. మునుపటి కంటే మరింత ఎక్కువ ఆశతో, అంచనాలతో మనల్ని చూస్తోంది. ఎంతటి సవాల్ ఎదురైనా మనల్ని మనం బలహీనులుగా భావించకుండా, వెనకడుగు వేయకుండా ఉందాం. కరోనా టైమ్‌లో మన శాస్త్ర, సాంకేతికత తనను తాను నిరూపించుకుంది. మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో మనం ఇచ్చిన సలహాలు, సూచనలు, పరిష్కరించిన జవాబులు, సమాధానాలు మొత్తం ప్రపంచానికి స్ఫూర్తిని ఇచ్చాయి’ అని మోడీ చెప్పారు.