దౌల్తాబాద్ గ్రామంలో అక్రమ అరెస్టులపై యువకుల ధర్నా

దౌల్తాబాద్ గ్రామంలో అక్రమ అరెస్టులపై యువకుల ధర్నా

సంగారెడ్డి (హత్నూర), వెలుగు: సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్ గ్రామంలో బుధవారం అక్రమ అరెస్టులను నిరసిస్తూ పలువురు యువకులు ధర్నా చేపట్టారు. రెండు రోజుల క్రితం  శ్రీరామ శోభాయాత్రలో జరిగిన ఘటనకు ఓ వర్గం యువకుడే కారణమని అతడి పండ్ల షాపును దహనం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కొంతమంది యువకులను పీఎస్​కు పిలిపించి అదుపులోకి తీసుకుంటున్నారు.

దీనిని పలువురు యువకులు తీవ్రంగా ఖండిస్తూ  దౌల్తాబాద్​చౌరస్తాలోని అంబేద్కర్​ విగ్రహం దగ్గర ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, మురళీ యాదవ్ జిన్నారం పోలీస్ స్టేషన్ కు వెళ్లి పూచీకత్తుపై యువకులను విడిపించారు. ఈ సందర్భంగా బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ తప్పు చేసిన వారిని వదిలిపెట్టి రామ భక్తులైన  హిందూ యువకులను అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సీఐ వేణు కుమార్ ఘటన స్థలానికి వచ్చి యువకులకు నచ్చజెప్పడంతో ధర్నా విరమించారు.