చంద్రయాన్-3 అరుదైన ఘనత.. ఇస్రోను అభినందించిన యూట్యూబ్ చీఫ్

చంద్రయాన్-3 అరుదైన ఘనత.. ఇస్రోను అభినందించిన యూట్యూబ్ చీఫ్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైన విషయం తెలిసిందే. చంద్రుని దక్షిణ ధ్రువంపై సురక్షితంగా కాలుమోపిన ఈ మూన్ మిషన్.. దేశ కీర్తిని మరో అడుగు పెంచింది. ఈ ప్రయోగం ద్వారా చంద్రునిపై అడుగుపెట్టిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ జాబిల్లి ఉపరితలంపై అనేక పరిశోధనలు జరిపి.. ఎంతో విలువైన సమాచారాన్ని భూమికి చేరవేశాయి. అయితే.. చంద్రునిపై కాలుమోపే సమయంలోనూ ఈ మూన్ మిషన్ ఓ అరుదైన ఘనత సాధించింది.

యూట్యూబ్‌లో సరికొత్త రికార్డు

ఆగస్టు 23న 'చంద్రయాన్-3' మిషన్ చంద్రుని ఉపరితలంపై ల్యాండ్ అవుతున్న దృశ్యాలను ఇస్రో యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఈ లైవ్ స్ట్రీమింగ్‌ ప్రసారాలను 8 మిలియన్.. అంటే 80 లక్షలకు పైగా యూజర్లు తిలకించారు. దీంతో ఈ ప్రయోగం ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించబడిన లైవ్ స్ట్రీమింగ్‌గా చరిత్ర సృష్టించింది. ఈ ఘనత సాధించిన ఇస్రోపై.. యూట్యూబ్ చీఫ్ నీల్ మోహన్ ప్రశంసలు కురిపించారు.

Also Read :- వాయుసేన చేతికి తొలి సీ295 ప్లేన్

'ఏకకాలంలో 8 మిలియన్ల వ్యూస్ పొందడమన్నది నిజానికి నమ్మశక్యంగా లేదు. ఈ ఘనత సాధించిన ఇస్రో బృందానికి అభినందనలు..' అని నీల్ మోహన్ ట్వీట్ చేశారు.

నిద్రావస్థలో ల్యాండర్, రోవర్‌

ఇక చంద్రునిపై ప్రస్తుతం రాత్రివేళ కావడంతో ల్యాండర్, రోవర్‌లు నిద్రావస్థలో ఉన్నాయి. తిరిగి మేల్కొంటాయా! లేదా నిద్రావస్థలో కొనసాగుతాయా! అనేది సెప్టెంబర్ 22న తేలనుంది. ఎందుకంటే చంద్రుడు.. భూమి చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి 28 రోజుల సమయం పడుతుంది. ఇందులో 14 రోజులు సూర్యుడి వెలుగులో ఉంటే.. మరో 14 రోజులు చీకట్లో ఉంటాడు. ఈ 14 రోజుల రాత్రి వేళల్లో చంద్రుడి దక్షిణ ధృవంపై నమోదయ్యే ఉష్ణోగ్రత మైనస్ 230 డిగ్రీలు. గడ్డ కట్టించే ఇంత తీవ్రమైన చలిని ల్యాండర్, రోవర్ తట్టుకోగలవా! అన్నది ప్రశ్న.