రాబిన్ హుడ్​ ఇన్వెస్టర్లకు యూట్యూబే యూనివర్సిటీ

రాబిన్ హుడ్​ ఇన్వెస్టర్లకు యూట్యూబే యూనివర్సిటీ

స్టాక్‌‌‌‌ మార్కెట్‌‌‌‌ చానెల్స్‌‌‌‌కు పెరుగుతున్న ఫాలోవర్స్‌‌‌‌
కొత్త అకౌంట్ల క్రియేషన్‌‌‌‌లో వీటి పాత్ర కీలకం
కిందటేడాది కోటికి పైగా న్యూ అకౌంట్లు

బిజినెస్‌‌డెస్క్‌‌, వెలుగు: యూట్యూబ్‌‌‌‌ వల్ల స్టాక్‌‌‌‌ మార్కెట్లలో ఇన్వెస్టర్లు పెరుగుతున్నారు. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. యూట్యూబ్‌‌‌‌ చానెల్స్‌‌‌‌, సోషల్‌‌‌‌ మీడియా యూజర్ల టిప్‌‌‌‌ల వలన లక్షల మంది కొత్త ఇన్వెస్టర్లు మార్కెట్‌‌‌‌లో ఇన్వెస్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ చేస్తున్నారు. డీమాట్ అకౌంట్‌‌‌‌ ఓపెన్ చేయడం సులభం కావడంతో మార్కెట్లలో రాబిన్ హుడ్‌‌‌‌(ఫస్ట్‌‌‌‌ టైమ్‌‌‌‌) ఇన్వెస్టర్లు పెరుగుతున్నారు. తన యూట్యూబ్‌‌‌‌ చానెల్ ద్వారా స్టాక్ మార్కెట్‌‌‌‌ గురించి వివరించే ప్రసాద్‌‌‌‌ లెండ్వేకు  ‘ఏ షేరు బాగుంటుంది’,‘ మ్యూచువల్‌‌‌‌ ఫండ్స్‌‌‌‌లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి’ వంటి విషయాలు వివరించాలంటూ  కుప్పలు తెప్పలుగా రిక్వెస్ట్‌‌‌‌లు వచ్చాయి. హైదరాబాద్‌‌‌‌కు ట్రిప్‌‌‌‌కు వచ్చిన తనకు ఈ అనుభవం ఎదురయ్యిందని ప్రసాద్ చెబుతున్నారు. ‘మ్యూచువల్‌‌‌‌ ఫండ్స్‌‌‌‌ లేదా ఈక్విటీల్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలో చెప్పాలని నా ఫ్రెండ్స్‌‌‌‌ తరచూ అడుగుతున్నారు. ఆటో డ్రైవర్‌‌‌‌‌‌‌‌ ఒకరు నెలకు రూ. 500 ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్‌‌‌‌ ఫండ్‌‌‌‌ అకౌంట్‌‌‌‌ను ఎలా క్రియేట్‌‌‌‌ చేయాలని అడిగారు’ అని ప్రసాద్ పేర్కొన్నారు.  యూట్యూబ్‌‌‌‌ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌ను ఓపెన్ చేసిన మొదట్లో స్టాక్ ఇన్వెస్టింగ్‌‌‌‌పై ఎవరూ ఆసక్తి చూపించలేదని, తక్కువ మంది ఫాలోవర్లు మాత్రమే ఉండేవారని చెప్పారు. ‘ఫిన్నోవేషన్‌‌‌‌ జెడ్‌‌‌‌’ పేరుతో యూట్యూబ్‌‌‌‌ చానెల్‌‌‌‌ను ప్రసాద్‌‌‌‌ నడుపుతున్నారు. అమెరికాలో వాల్‌‌‌‌స్ట్రీట్‌‌‌‌ బెట్స్‌‌‌‌ వంటి ఫ్రీ ప్లాట్‌‌‌‌ఫామ్స్‌‌‌‌ ద్వారా ఇన్వెస్టర్లు స్టాక్‌‌‌‌ టిప్స్‌‌‌‌ను పొందుతుంటారు. మార్కెట్లోకి ఎంటర్ అవుతుంటారు.  ఇండియాలో ఇండియన్ స్టాక్ మార్కెట్ల వైపుకి కొత్త ఇన్వెస్టర్లను నడుపుతున్నది ప్రసాద్ లాంటి యూట్యూబ్‌‌‌‌ ఇన్‌‌‌‌ఫ్లూయెన్సర్లు, షేర్ల టిప్స్‌‌‌‌ను ఇచ్చే ప్రైవేట్ సొషల్ మీడియా యూజర్లేనని ఎనలిస్టులు అంటున్నారు. గత కొన్నేళ్ల నుంచి చూస్తే వీటి వలన లక్షల మంది ట్రేడర్లు, ఇన్వెస్టర్లు జెరోదా బ్రోకింగ్‌‌‌‌, ఏంజెల్ బ్రోకింగ్, పేటీఎం మనీ వంటి యాప్‌‌‌‌లలో తమ అకౌంట్లను క్రియేట్ చేసుకున్నారు చెప్పారు.

స్టాక్ మార్కెట్‌‌‌‌ చానెల్స్‌‌‌‌కు పెరిగిన ఫాలోవర్లు

స్టాక్ మార్కెట్‌‌‌‌ బేసిక్స్‌‌‌‌ను వివరించే ఓ యూట్యూబ్‌‌‌‌ చానెల్‌‌‌‌ను ప్రసాద్‌‌‌‌ 2014 లో ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన దగ్గర 43 మంది పనిచేస్తున్నారు. కంటెంట్‌‌‌‌ను క్రియేట్ చేయడం, సేల్స్‌‌‌‌ వంటి వాటిని వీళ్లు చూసుకుంటారు. 2019 నుంచి చూస్తే  ఆయన యూట్యూబ్‌‌‌‌ ఫాలోవర్ల సంఖ్య మూడు రెట్లు పెరిగి 13.8 లక్షలకు చేరింది. కిందటేడాది డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో బర్గర్‌‌‌‌‌‌‌‌ కింగ్ ఐపీఓపై చేసిన వీడియోను 2.75 లక్షల మంది చూశారని ప్రసాద్ చెబుతున్నారు. ప్రైవేట్ చాట్‌‌‌‌ యాప్స్‌‌‌‌ కూడా కొత్త ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయి. ఇలానే మార్కెట్‌‌‌‌లో ఎంటర్ అయిన వాళ్లల్లో 25 ఏళ్ల అరుణ్‌‌‌‌ జోసెఫ్‌‌‌‌ కూడా ఉన్నారు. ఓ టెలిగ్రామ్‌‌‌‌ గ్రూప్‌‌‌‌లో జాయిన్‌‌‌‌ అయిన ఆయన, స్టాక్ టిప్స్ ఆధారంగా మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టారు. స్టాక్ మార్కెట్ల ద్వారా సూపర్‌‌‌‌‌‌‌‌ రిచ్‌‌‌‌ ఎలా అవ్వాలని ఎప్పుడూ మాట్లాడుతుంటారని జోసెఫ్‌‌‌‌ పేర్కొన్నారు. జేఎస్‌‌‌‌డబ్ల్యూ స్టీల్‌‌‌‌లో  ఇన్వెస్ట్‌‌‌‌ చేయడం వలన మొదట్లో లాభాలొచ్చాయని చెప్పారు. కానీ ప్రస్తుతం తన పోర్టుఫోలియో రెడ్‌‌‌‌లో ఉందని అన్నారు. టెలిగ్రామ్‌‌‌‌లో టిప్స్‌‌‌‌ను ఆధారంగా టాటా మోటార్స్‌‌‌‌  షేరును హోల్డ్‌‌‌‌ చేస్తున్నానని చెప్పారు. కరోనా లాక్‌‌‌‌డౌన్‌‌‌‌తో రాబిన్‌‌‌‌ హుడ్‌‌‌‌ ఇన్వెస్టర్లు పెరిగారు. డిపాజిటరీ డేటా ప్రకారం కిందటేడాది కోటి కొత్త డీమాట్ అకౌంట్లు ఓపెన్‌‌‌‌ అయ్యాయి. ఇండియన్ స్టాక్ మార్కెట్ల రోజువారి టర్నోవర్‌‌‌‌‌‌‌‌ కూడా ఏడాది ప్రాతిపదికన జనవరిలో రెండింతలు పెరిగి రూ. 16.3 లక్షల కోట్లకు చేరుకుంది.

యూట్యూబ్‌‌ స్టార్ సీఏ రచన‌‌..

స్టాక్ మార్కెట్‌‌‌‌ను సులభంగా వివరించి తనకంటూ ఓ బ్రాండ్‌‌‌‌ను క్రియేట్‌‌‌‌ చేసుకున్నారు రచనా రణడే. సీఏ స్టూడెంట్లకు క్లాస్‌‌‌‌లు చెప్పే ఆమె, వారికోసమే 2009 లో ఓ యూట్యూబ్ చానెల్‌‌‌‌ను ఓపెన్‌‌‌‌ చేశారు. తన క్లాస్‌‌‌‌లను అప్‌‌‌‌లోడ్‌‌‌‌ చేయడం మొదలు పెట్టారు. కానీ స్టాక్ మార్కెట్‌‌‌‌ గురించి 2019 నుంచే వీడియోలు చేస్తున్నారు. ‘బేసిక్స్‌‌‌‌ ఆఫ్ స్టాక్ మార్కెట్‌‌‌‌’ వీడియో తో ఫేమస్‌‌‌‌ అయిన రచన, ప్రస్తుతం జెరోదా, అప్‌‌‌‌స్టాక్స్ వంటి స్టాక్ బ్రోకర్లతో రెవెన్యూ షేరింగ్‌‌‌‌ మోడల్‌‌‌‌లో పనిచేస్తున్నారు. ఆమె యూట్యూబ్‌‌‌‌ చానెల్‌‌‌‌ ‘సీఏ రచనా ఫాడ్కే రణడే’ను 19.3 లక్షల మంది ఫాలో అవుతుండడం విశేషం.