యూట్యూబర్​: నవ్విస్తూ.. నాలెడ్జ్‌ పంచుతున్నడు!

యూట్యూబర్​: నవ్విస్తూ.. నాలెడ్జ్‌ పంచుతున్నడు!

సాధారణంగా పేషెంట్‌ పరిస్థితి చూసి డాక్టర్‌‌కు ఆందోళన పెరుగుతుంది. కానీ.. డాక్టర్‌‌ పాల్‌ పరిస్థితి రివర్స్​లో ఉండేది. కారణం..అందరికీ బరువు తగ్గాలని చెప్పే ఆయన అధిక బరువు ఉండడం. దాంతో ఆయన దగ్గరకు వచ్చే పేషెంట్స్​ ఆయన్ని చూసి ఆందోళన పడేవారు. ఇదంతా ఒకప్పటి సంగతి. మరి ఇప్పుడు అంటున్నారా? ఆయన ఆరోగ్యకరంగా బరువు తగ్గాడు. తనలా ఇంకెవరూ బాధపడకూడదని.. యూట్యూబ్‌లో బోలెడన్ని హెల్త్​ లెసన్స్​ చెప్తున్నాడు. 

డాక్టర్​ పాల్​గా సోషల్​ మీడియా ఫాలో అయ్యేవాళ్లకి సుపరిచితుడు. ఈయన పూర్తి పేరు డాక్టర్ పళనియప్పన్ మాణిక్కం. స్వస్థలం తమిళనాడులోని మధురై. అమెరికాలోని   కాలిఫోర్నియా, శాక్రమెంటోలో గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ గా సెటిలయ్యాడు. ఆయన స్పెషాలిటీ ఏంటంటే ఎంత కఠినమైన విషయాన్నైనా అందరికీ అర్థమయ్యే ఇంగ్లిష్ లో కామెడీగా చెప్పడం.

ఆయన మాటలు విన్నవాళ్లు ఒక పక్క నవ్వుతూనే.. మరో పక్క ఆలోచనల్లో పడతారు. అంటే.. ‘మెడ్‌కామ్’ (మెడికల్ కామెడీ) వాడి హెల్త్‌ ఇన్ఫర్మేషన్‌ని జనాల బుర్రల్లోకి చేరుస్తాడన్నమాట. అనారోగ్యంతో బాధపడేవాళ్లకు తనవంతు సాయంగా సలహాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే సోషల్‌ మీడియాలో వీడియోలు కూడా పోస్ట్‌ చేస్తున్నాడు. అదే ఆయన్ను స్టాండప్‌ కామెడీ వైపు అడుగులు వేసేలా చేసింది. అలా ఆయన ప్రపంచవ్యాప్తంగా స్టాండప్ కామెడీ టూర్స్​ చేస్తున్నాడు. 

2020లో మొదలు...

తన దగ్గర ఎండోస్కోపీ చేయించుకోవడానికి వచ్చే పేషెంట్స్​కు జోకులు చెప్పి నవ్వించేవాడు. అయితే ఆ కామెడీ కాలిఫోర్నియాలో అతని దగ్గరకు వెళ్లే పేషెంట్స్​కు మాత్రమే పంచేవాడు. అది బాగా వర్కవుట్‌ అయింది. దాంతో 2020 నుంచి సోషల్‌ మీడియా ద్వారా అందరికీ పంచుతున్నాడు. ఇప్పుడు అతనితోపాటు ప్రపంచంలో చాలామంది నవ్వుతూ ‘ఆరోగ్యం’ గురించి తెలుసుకుంటున్నారు. వాస్తవానికి 2010లో యూట్యూబ్‌ ఛానెల్‌ పెట్టినా.. 2020 కరోనా టైంలో వీడియోలు చేయడం మొదలుపెట్టాడు. కొవిడ్–19పై ఆయన చేసిన ఒక వీడియో వైరల్‌ కావడంతో సబ్‌స్క్రయిబర్స్ పెరుగుతూ వచ్చారు.

ఈ వ్యాసం రాసే టైంకి ‘డాక్టర్ పాల్‌’ ఛానెల్​కు 2.17 మిలియన్ల సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. ఛానెల్‌లో 552 వీడియోలు అప్‌లోడ్‌ అయ్యాయి. ఈ ఛానెల్‌ని అమెరికా నుంచి నడుపుతున్నాడు. ఆయన చేసిన షార్ట్‌ వీడియోలకు వ్యూస్‌ ఎక్కువగా వస్తుంటాయి. ఒక వీడియోకు ఏకంగా 69 మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి. అంతేకాదు.. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలోయింగ్ బాగానే ఉంది. 1.2 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు.

ఇబ్బందిపడకుండా ఉండేందుకు

సీరియస్‌ విషయాన్ని కామెడీగా చెప్పాలనే ఆలోచన ఎలా వచ్చింది అని అడిగితే.. ‘‘నేను గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్​ని. అందుకని నా దగ్గరకు హెమరాయిడ్స్, పైల్స్ వంటి సమస్యలతో ఎక్కువమంది పేషెంట్స్​ వచ్చేవాళ్లు. కానీ.. వాళ్ల సమస్య గురించి వివరించి చెప్పడానికి బాగా ఇబ్బంది పడేవాళ్లు. మరీ ముఖ్యంగా వాళ్ల అలవాట్ల గురించి డిస్కస్​ చేయాల్సి వచ్చినప్పుడు ఫీల్‌ కాకూడదనే ఉద్దేశంతో ముందుగా ఒక జోక్‌ వేసేవాడ్ని. దాంతో పేషెంట్స్​ కూడా మొహమాటం వదిలి సమస్యను చెప్పేవాళ్లు. ఆ టెక్నిక్​ బాగా వర్కవుట్​ కావడంతో... అప్పటినుంచి అదే కంటిన్యూ చేస్తున్నా” అన్నాడు డాక్టర్ పాల్.

పాల్‌ చేసే కామెడీ వీడియోల వల్ల ఆయనకు కాలిఫోర్నియా బే ఏరియాలో ఉన్న ‘బిల్డింగ్–18’ అనే స్టాండప్ కామెడీ క్లబ్‌లో అవకాశం వచ్చింది. దాంతో 39 ఏండ్ల స్టాండప్ కమెడియన్ మరో ప్రస్తానం మొదలుపెట్టాడు. 2020 మేలో ‘బిల్డింగ్–18’లో చేరాడు.

స్క్రిప్ట్‌ ఎలా రాసుకోవాలి? పంచ్ ఎలా వేయాలి? స్టాండప్ కామెడీ ఎలా చేయాలి? వంటి విషయాలన్నీ నేర్చుకు న్నాడు. అయితే.. కొన్నిసార్లు కామెడీ చేయడం మెడిసిన్ చదవడం కంటే కష్టంగా ఉందంటాడు పాల్‌. ఇప్పుడాయన అమెరికా లోనే కాదు ఇండియా, మలేసియా, సింగపూర్‌లలో కూడా ‘మెడ్‌కామ్’ స్టాండప్ కామెడీ షోలు చేస్తున్నాడు.

బరువు తగ్గి.. 

పాల్‌ తన పేషెంట్లకు.. ముఖ్యంగా ఫ్యాటీ లివర్‌‌ సమస్యతో బాధపడేవాళ్లకు బరువు తగ్గాలని సలహా ఇచ్చేవాడు. కానీ.. ఆయన మాత్రం తన బరువు గురించి పట్టించుకునేవాడు కాదు.15 ఏండ్ల పాటు పేషెంట్స్​ను చూడడమే తప్ప తన గురించి ఎప్పుడూ పెద్దగా ఆలోచించలేదు. దాంతో ఆయన బరువు100 కిలోలకు చేరింది. అందుకే ముందుగా ఆయన బరువు తగ్గి... ఆ తర్వాత పేషెంట్లకు చెప్పాలి అనుకున్నాడు. అందుకు చాలా తక్కువ టైంలోనే దాదాపు పాతిక కిలోల బరువు తగ్గాడు.

ఆయన నేర్చుకున్న పాఠాలను ప్రజలతో పంచుకోవడం మొదలుపెట్టాడు. ముఖ్యంగా గట్ హెల్త్‌, ఫ్యాటీ లివర్‌‌, హార్ట్‌ హెల్త్‌, తినాల్సిన ఫుడ్‌, ఆరోగ్యకరమైన లైఫ్‌ స్టయిల్‌ కోసం చిట్కాలు చెప్తుంటాడు. డైట్ పాటించడం ఇష్టం లేని ‘శరవణ కుమార్’ అనే ఒక ఊహాజనిత క్యారెక్టర్‌‌ని క్రియేట్‌ చేశాడు. అనారోగ్యకర అలవాట్లను ఆ క్యారెక్టర్‌‌కి ఆపాదించి చెప్తుంటాడు. ‘‘2030 నాటికి ప్రజల ఆరోగ్యం మెరుగుపడాలి. నా దగ్గరికి వచ్చే పేషెంట్ల సంఖ్య 30 శాతం వరకు తగ్గాలనే లక్ష్యంతో పనిచేస్తున్నా” అంటున్నాడు డాక్టర్ పాల్.