గిరిజన మహిళపై దారుణంగా ప్రవర్తించారు.. పోలీసులను శిక్షించరా?

గిరిజన మహిళపై దారుణంగా ప్రవర్తించారు.. పోలీసులను శిక్షించరా?

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులకు, పార్టీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వైఎస్ షర్మిల‌ను పోలీసులు హయత్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 

రంగారెడ్డి జిల్లా బీఎన్ రెడ్డి నగర్ శ్యామ్ ఆస్పత్రి ముందు రోడ్డుపై షర్మిల బైఠాయించారు. గిరిజన మహిళ లక్ష్మికి తక్షణ న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ధర్నా కొనసాగిస్తానని షర్మిల స్పష్టం చేశారు. షర్మిలను అరెస్ట్ చేయకుండా కార్యాకర్తలు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. అంతటితో ఆగకుండా పోలీసులు ఆందోళన కారులపై లాఠీ చార్జ్ చేసి షర్మిలను అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి.

వైఎస్ షర్మిల రోడ్డుపై బైఠాయించడంతో సాగర్ రింగ్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జాం అయింది. సాగర్ రోడ్డు, బి.యన్. రెడ్డి చౌరస్తాలో కిలోమీటర్ మేర ట్రాఫిక్ ఆగిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

గిరిజన మహిళ లక్ష్మిపై పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున(ఆగస్టు 15) గిరిజన మహిళపై ఎబ్బీనగర్ పోలీసులు చేసిన దాడిని ఆమె ఖండించారు. శ్యాం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గిరిజన మహిళ లక్ష్మిని వైఎస్ షర్మిల పరామర్శించారు. ఆ తర్వాత శ్యాం హాస్పిటల్ ముందు కూర్చొని వైఎస్ షర్మిల నిరసన చేపట్టారు. బాధిత మహిళకు న్యాయం జరిగే వరకు రోడ్డుపై నుంచి కదిలేదే లేదని షర్మిల డిమాండ్ చేశారు. లక్ష్మీకి న్యాయం చేయాలని నినాదాలతో హోరెత్తించారు. దీంతో పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. షర్మిలను బలవంతంగా అరెస్ట్ చేసి..  హయత్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు.