ఇంట్లో అర్హులందరికీ రూ. 3 వేల పెన్షన్ : వైఎస్ షర్మిల

ఇంట్లో అర్హులందరికీ రూ. 3 వేల పెన్షన్ : వైఎస్ షర్మిల

అధికారంలోకి వచ్చాక ఇంట్లో  ఎంత మంది అర్హులుంటే అంతమందికి రూ. 3000 చొప్పున పెన్షన్ ఇస్తామని వైఎస్ షర్మిల హామీ ఇచ్చారు. ప్రజా ప్రస్థాన యాత్రలో భాగంగా స్టేషన్ ఘన్ పూర్ లో నిర్వహించిన సభలో షర్మిల పాల్గొన్నారు. సీఎం అయ్యాక తన మొదటి సంతకాన్ని ఉద్యోగాల భర్తీ ఫైలుపైనే చేస్తానని చెప్పారు. రాష్ట్రంలో బెల్టు షాపులనేవి లేకుండా చేస్తానని మహిళలకు ఆమె హామీ ఇచ్చారు. వ్యవసాయాన్ని పండుగలా మారుస్తానని రైతులకు భరోసా ఇచ్చారు.

కేసీఆర్ ది దిక్కుమాలిన పాలనన్న షర్మిల.. డబుల్ బెడ్రూమ్ నుంచి రైతుల రుణమాఫీ వరకు  అన్నింటా మోసమే చేశారని విమర్శించారు. 8 ఏండ్లుగా అధికారంలో ఉన్న ఆయన మోసం చేయని వర్గం లేదని ఆరోపించారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి బార్లు, బీర్ల తెలంగాణ మార్చాడని మండిపడ్డారు. ఇప్పటికే రెండుసార్లు కేసీఆర్ కు అధికారం ఇచ్చి తప్పు చేశామన్న షర్మిల... మళ్లీ కేసీఆర్ మాటలు నమ్మి మోసపోవవద్దన్నారు. ఈసారి కేసీఆర్ ను గెలిపిస్తే మీ బిడ్డలు కూడా మిమ్మల్ని క్షమించరని చెప్పారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ పాలనను తిరిగి తీసుకొస్తానని షర్మిల హామీ ఇచ్చారు.