కడియం అసలైన తెలంగాణ ద్రోహి : షర్మిల

కడియం అసలైన తెలంగాణ ద్రోహి : షర్మిల

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి వైఎస్ షర్మిల కౌంటర్ ఇచ్చారు. తనని తెలంగాణ ద్రోహి అన్న కడియం మంత్రిగా పనిచేసి కూడా నియోజకవర్గానికి ఒక్క డిగ్రీ కాలేజీ తీసుకురాలేదని విమర్శించారు. ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని పదవులు అనుభవించిన కడియం అసలైన తెలంగాణ ద్రోహి అని ఆరోపించారు.  స్టేషన్ ఘనపూర్ కు చెందిన ఇద్దరు రాజయ్యలు అధికార పార్టీలో ఉండి ఏ లాభమని షర్మిల ప్రశ్నించారు. ప్రెస్ మీట్లు పెట్టుకుని ఒకరినొకరు తిట్టుకోవడం తప్ప వీళ్లకు  ప్రజా సమస్యల మీద సోయి ఉందా అని నిలదీశారు. దళిత నేతలై ఉండి దళితులకు అన్యాయం జరిగితే నోరు విప్పరా అని ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసి స్టేషన్ ఘనపూర్ కు చేసింది గుండు సున్నా అని విమర్శించారు. 

రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ వెన్నుపోటు పొడిస్తే..ఈ గడ్డకు సేవ చేసేందుకే తాను పార్టీ పెట్టానని వైఎస్  షర్మిల చెప్పారు. రాష్ట్రాన్ని బంగారు పళ్లెంలో కేసీఆర్ కు అప్పగిస్తే అప్పుల కుప్పగా మార్చిండని మండిపడ్డారు. కమిషన్ల రూపంలో రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టిన దొంగ కేసీఆర్ అని ఆరోపించారు.