
నిజామాబాద్, వెలుగు: దత్తత తీసుకున్న మునుగోడును కాళేశ్వరం కమీషన్లతో అభివృద్ధి చేస్తారా? ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్ డబ్బులతో అభివృద్ధి చేస్తారా? ప్రభుత్వ ధనంతో అభివృద్ధి చేస్తారా? స్పష్టం చేయాలని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల ప్రశ్నించారు. ప్రభుత్వ డబ్బులతో పనులు చేసేదైతే దత్తత అనే పేరు ఎందుకని అన్నారు. షర్మిల గురువారం నిజామాబాద్ జిల్లాలో పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇన్నాళ్లూ మునుగోడును పట్టించుకోని కేసీఆర్.. కేవలం ఉప ఎన్నికలో గెలిచేందుకే దత్తత నాటకం ఆడుతున్నారని అన్నారు.
గతంలో దత్తత తీసుకున్న కొడంగల్ పరిస్థితి ఏంటని, ఇప్పుడు మునుగోడును దత్తత తీసుకుంటే ఏం ఒరుగుతుందని అన్నారు. వాళ్ల పాలన మీద వాళ్లకు నమ్మకం లేకనే ఓట్లు కొనేందుకు ఒక్కో ఎమ్మెల్యేకు ఒక్కో గ్రామం అప్పజెప్పారని అన్నారు. కవితను లిక్కర్ స్కామ్ నుంచి తప్పించేందుకే ఢిల్లీలో వారంపాటు మకాం వేశారని అన్నారు. బీజేపీ కోటలు బద్దలు కొడతాం, మెడలు వంచుతం అని చెప్పిన కేసీఆర్.. ఢిల్లీలో వాళ్ల కాళ్ల మీదపడి కేసులు మాఫీ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఒకప్పుడు స్కూటర్‌పై తిరిగిన కేసీఆర్‌కు.. ఇప్పుడు లక్షల కోట్లు ఎలా వచ్చాయన్నారు. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ భూముల కబ్జాలతో భూముల గణేశ్‌గా మారారని ఆరోపించారు.