ఊసరవెల్లి కూడా చంద్రబాబు వద్దే రంగులు మార్చడం నేర్చుకుంది: షర్మిల

ఊసరవెల్లి కూడా చంద్రబాబు వద్దే రంగులు మార్చడం నేర్చుకుంది: షర్మిల

అనంతపురంలో కాంగ్రెస్​ న్యాయ సాధన సభ నిర్వహించింది.  పోరాడదాం.. సాదిద్ధాం నినాదంతో ఈ సభ నిర్వహించారు. ఈ సభలో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మాట్లాడుతూ...రాష్ట్ర ప్రజలకు మేలు చేయడం కోసమే ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టా. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక.. ఇందిరమ్మ అభయం కింద ఇంటింటికి మహిళల పేరు మీద రూ.5 వేల ఆర్థిక సాయం అందజేస్తామంటూ...  షర్మిల చంద్రబాబు, జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. 

ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి ప్రధాన కారణం ఓవైపు చంద్రబాబు అయితే, మరోపక్క వైఎస్ జగన్ అని ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. ఇద్దరూ కలిసి బీజేపీ మెడలు వంచి ఉండి ఉంటే.. ఈపాటికి మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చుండేదని అన్నారు. ఊసరవెల్లి కూడా చంద్రబాబు వద్దే రంగులు మార్చడం నేర్చుకుందని వైఎస్ షర్మిల అన్నారు. సీఎం అయ్యాక చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీ అన్నారని షర్మిల గుర్తు చేశారు.

 అటు చంద్రబాబు, ఇటు జగన్ ఇద్దరూ ప్రత్యేక హోదాను విస్మరించారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు.   ప్రత్యేక హోదా రానందునే ఏపీకి పరిశ్రమలు రాలేదు. అందుకే యువతకు ఉద్యోగాలు కూడా రాలేదు. చంద్రబాబు, వైఎస్ జగన్ ఇద్దరూ బీజేపీతో అంటకాగుతూ... ఆ పార్టీకి బానిసలుగా మారారని విమర్శించారు. బీజేపీకి మనకు ఏం ఇచ్చింది? మనకు ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే.. ఎలా పొత్తులు పెట్టుకున్నా అడిగేవారు కాదు. కానీ, ఏపీకి బీజేపీ అన్యాయం చేస్తున్నా కూడా ప్రశ్నించకపోగా.. అదే పార్టీతో పొత్తులు పెట్టుకుంటుంటే.. ప్రజలకు ద్రోహం చేస్తున్నట్లు కాదా?  అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేస్తోందని షర్మిల వ్యాఖ్యానించారు. టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నాయని షర్మిల ప్రశ్నించారు. రాష్ట్ర విభజన హామీలను బీజేపీ ఒక్కటైనా నెరవేర్చిందా అని నిలదీశారు. ప్రజలకు సమాధానం చెప్పిన తర్వాతే ప్రజలను టీడీపీ, జనసేన ఓట్లు అడగాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.