ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర వైఎస్ షర్మిల ధర్నా

ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర వైఎస్ షర్మిల ధర్నా

ఢిల్లీ : ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆందోళన చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని, దీనిపై సీబీఐ, ఈడీలతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిపై విచారించాలని కోరారు. ఈ సందర్భంగా  వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు, కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. ‘కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో’ అంటూ నినాదాలు చేశారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ వేల కోట్ల కమీషన్లు దండుకున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. రీ డిజైనింగ్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టును మూడు రెట్లు వ్యయం పెంచారని చెప్పారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని మరోసారి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద స్కామ్ అని వైఎస్ షర్మిల ఆరోపించారు. ప్రజల సొమ్ము లక్షల కోట్లను కేసీఆర్ దోచుకున్నారని ఆరోపించారు. 38 వేల కోట్ల ప్రాజెక్టును ఒక లక్ష 50 వేల కోట్లకు పెంచారని చెప్పారు. మూడు సార్లు ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని పెంచారన్నారు. 

ప్రాజెక్టు వల్ల చాలా మంది నిరాశ్రులయ్యారని, వారికి ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయలేదని వైఎస్ షర్మిల అన్నారు. నాణ్యత లేకుండా ప్రాజెక్టు కట్టారని, ప్రతి ఏటా వేల ఎకరాల పంట పొలాలు మునిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక అద్భుతమంటూ కేసీఆర్ తెలంగాణతో పాటు దేశ ప్రజలను సైతం మోసం చేశారని మండిపడ్డారు. ప్రాజెక్టు నిర్మాణంలో రూ.70 వేల కోట్ల అవినీతి జరిగిందనీ, 2జీ, బొగ్గు కుంభకోణం కంటే.. ఇది పెద్ద స్కామ్ అని ఆరోపించారు. 

ప్రాజెక్టు రీ డిజైనింగ్ పేరుతో లక్షా 20 వేల కోట్ల ఖర్చుతో కేవలం 18 లక్షల 25 వేల 700 ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చేలా నిర్మించారని వైఎస్ షర్మిల చెప్పారు. ఇంత ఖర్చు చేసి కేవలం లక్షా 50 వేల ఎకరాలకు మాత్రమే కాళేశ్వరం ద్వారా నీళ్లు ఇచ్చారని చెప్పారు. పంప్ హౌజ్ ల ఎత్తు కూడా చూసుకోకుండా కట్టారని, నాసిరకం పనులు చేశారని ఆరోపించారు. నిర్మాణ పనులపై ఆడిట్ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కాళేశ్వరం నీళ్లను ఎత్తిపోయడానికే పవర్ బిల్ రూ.3 వేల కోట్లు ఖర్చయిందని, లోన్లకు వడ్డీలే రూ.13 వేల కోట్లు కడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.