బీజేపీ, కాంగ్రెస్ ప్రతిపక్షాలుగా విఫలమైనయ్ : షర్మిల

బీజేపీ, కాంగ్రెస్ ప్రతిపక్షాలుగా విఫలమైనయ్ : షర్మిల

కేసీఆర్కు ఓట్లు వేసినందుకు ప్రజలు నరకం చూస్తున్నారని వైఎస్ షర్మిల అన్నారు. ఓట్లు కావల్సినప్పుడే  కేసీఆర్కు ప్రజలు గుర్తుకొస్తారని షర్మిల విమర్శించారు. గారడీ మాటలతో ప్రజలను బురిడీ కొట్టించి క్షట్లు వేయించుకుంటాడని అన్నారు. కేజీ టూ పీజీ ఉచిత విద్య, డబుల్ బెడ్ రూం ఇల్లు, దళితులకు మూడెకరాల భూమి, ఉచిత ఎరువులు వంటి ఏ ఒక్క హామీని కేసీఆర్ అమలుచేయలేదన్నారు. కరీంనగర్ జిల్లా  కేశవపట్నం గ్రామస్తులతో ఆమె మాటముచ్చట కార్యక్రమం నిర్వహించారు.

వైఎస్సార్ పేదల కోసం 46 లక్షలఇళ్లు కట్టిస్తే.. కేసీఆర్ మాత్రం డబుల్ బెడ్ రూంలు అని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని షర్మిల మండిపడ్డారు. వైఎస్సార్ హయాంలో అన్ని వర్గాల ప్రజలను సంతోషంగా ఉన్నారన్నారు. కేసీఆర్ హయాంలో 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని మండిపడ్డారు. బంగారు తెలంగాణ అని చెప్పి బతకలేని తెలంగాణగా మార్చారని ఆరోపించారు. 

 కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరు చెప్పి లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని షర్మిల ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ ప్రతిపక్షాలుగా విఫలమయ్యాయని విమర్శించారు. ప్రజల పక్షాన నిలబడేందుకే పార్టీ పెట్టామని..వైఎస్సార్ పాలనను తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని తాగుబోతులకు అడ్డాగా మార్చారని విమర్శించారు. 40వేలు ఇచ్చే సబ్సిడీలను బంద్ పెట్టి.. రైతుబంధు పేరిట 5 వేలు ఇస్తే పేదలు కోటీశ్వరులు అవుతారా అని ప్రశ్నించారు.