వికారాబాద్ కు కేసీఆర్ అన్యాయం చేసిండు

వికారాబాద్ కు కేసీఆర్ అన్యాయం చేసిండు

వికారాబాద్ జిల్లా: సీఎం కేసీఆర్ వికారాబాద్ కు తీవ్ర అన్యాయం చేశారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. వికారాబాద్ టౌన్ లో జరిగిన వైఎస్ఆర్టీపీ బహిరంగ సభలో షర్మిల మాట్లాడారు. అనంతగిరి ప్రాంతాన్ని ఊటీ చేస్తానని, అక్కడ ఔషధ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన  కేసీఆర్ మాట తప్పారని మండిపడ్డారు. జిల్లాలో రింగు రోడ్డు, టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటును సీఎం అటకెక్కించారని, టీబీ ఆసుపత్రని ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తైతే ప్రజలకు నీళ్లొచ్చేవన్న షర్మిల... ప్రాజెక్టు నిర్మాణం పేరు చెప్పి రూ.17 వేల కోట్ల రూపాయలు దండుకున్నారని ఫైర్ అయ్యారు. తన ఎన్నికల అఫిడవిట్ లో రూ.38 కోట్లు  చూపించిన స్థానిక ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కు.. ఇవాళ వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు. దమ్ముంటే పాలమూరు నీళ్లపై కొట్లాడాలని సవాలు విసిరారు. 

సచివాలయానికి  అంబేద్కర్ పేరు, 10 శాతం రిజర్వేషన్లు అంటూ కేసీఆర్ దళితులు, గిరిజనులను మరోసారి మోసం చేయడానికి సిద్ధమయ్యారని షర్మిల ఆరోపించారు. దళిత మహిళ మరియమ్మను లాకప్ డెత్ చేస్తే ఒక్క దళిత ఎమ్మెల్యే కూడా మాట్లాడలేదని మండిపడ్డారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టించిన కేసీఆర్ కు దళితులపై ఏమాత్రం గౌరవం లేదని ఫైర్ అయ్యారు. దమ్ముంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు అంబేద్కర్ పేరు పెట్టాలని కేసీఆర్ ను డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ పాలనను తిరిగి తీసుకొస్తామని షర్మిల హామీ ఇచ్చారు.