వైఎస్ఆర్ బిడ్డను... భయపడే ప్రసక్తే లేదు

వైఎస్ఆర్ బిడ్డను... భయపడే ప్రసక్తే లేదు

రంగారెడ్డి: దమ్ముంటే తనను అరెస్ట్ చేయించాలని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సీఎం కేసీఆర్ కు సవాలు విసిరింది. షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర సోమవారం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నుంచి రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. టీఆర్ఎస్ నాయకుల అవినీతిని ప్రశ్నించినందుకు తనపై స్పీకర్ కు ఫిర్యాదు చేస్తారా అని మండిపడ్డారు. అసెంబ్లీకి ఎప్పుడు రమ్మన్న వస్తానని, అసెంబ్లీ ఎదుటనే టీఆర్ఎస్ నాయకుల అవినీతి బాగోతాన్ని బయటపెడ్తానని షర్మిల హెచ్చరించారు.  అక్రమంగా కేసులు పెట్టి పాదయాత్రను ఆపాలని టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. తమ పార్టీకి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక టీఆర్ఎస్ ప్రభుత్వం తనను అరెస్టు చేసేందుకు ప్లాన్ చేస్తోందని ఫైర్ అయ్యారు.

తాను వైఎస్ఆర్ బిడ్డనని, కేసులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రజలకు సేవ చేయడానికి నిశ్చయించుకున్నానని, ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మంత్రి నిరంజన్ రెడ్డికి తల్లికి చెల్లికి తేడా తెలియదన్నందుకు తనపై కేసు పెట్టారని, మరీ  తనను మరదలు అన్న నిరంజన్ రెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని షర్మిల నిలదీశారు. మాజీ సీఎం కూతురుగా తన ఫిర్యాదునే పోలీసులు పట్టించుకోవడం లేదని, ఇక సామాన్యల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలని చెప్పారు. బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఎలాగో కేసీఆర్ కు పోలీసులు అలాగ అని షర్మిల ఆరోపించారు.