కేసీఆర్ పాలనలో మహిళలకు రక్షణ కరువు

కేసీఆర్ పాలనలో మహిళలకు రక్షణ కరువు

మహబూబ్ నగర్: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. పాలమూరు నీళ్లపోరులో భాగంగా మహబూబ్ నగర్ పట్టణంలో షర్మిల 24 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. దీక్ష విరమణ తర్వాత ఆమె మాట్లాడుతూ.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ ను కేసీఆర్ నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలమూరు జిల్లాకు ఎంతో సేవ చేశారని అన్నారు. వలసల జిల్లాగా పేరున్న పాలమూరును బంగారుమయం చేశారని చెప్పారు. నెట్టెంపాడు, కోయిల్ సాగర్, కల్వకుర్తి ప్రాజెక్టులను నిర్మించి లక్షల ఎకరాలకు నీళ్లిచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డిదని అన్నారు. స్థానికులు ఉన్నత చదువులు చదవాలని వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలమూరు యూనివర్సిటీని ఏర్పాటు చేశారని, కానీ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలమూరును పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

జిల్లా నుంచి మంత్రిగా ఉన్న శ్రీనివాస్ గౌడ్ పాలమూరు అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలని షర్మిల ప్రశ్నించారు. లిక్కర్ అమ్మకాల మీద ఉన్న సోయి ఎక్సైజ్ మంత్రికి ప్రజా సమస్యల పరిష్కారంపై లేదని మండిపడ్డారు. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతుండటంతో రోజురోజుకు మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని షర్మిల మండిపడ్డారు.